Saturday, October 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబస్సు అద్దాలు పగలగొట్టి..10 మందిని కాపాడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

బస్సు అద్దాలు పగలగొట్టి..10 మందిని కాపాడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రమాదంలో చిక్కుకుని మంటల్లో కాలిపోతున్న బస్సు నుంచి సుమారు పది మంది ప్రయాణికులను కాపాడి మానవత్వం చాటుకున్నాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన హరీశ్, ఆయన స్నేహితులు చూపిన చొరవతో పది కుటుంబాల్లో వెలుగులు నిండాయి. అయితే, చుట్టూ ఉన్నవారు సాయం చేయకుండా వీడియోలు తీస్తూ ఉండిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హరీశ్ తన స్నేహితులు వంశీ, జ్ఞానేశ్వర్‌, మనీశ్వర్‌తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా పరిధిలో ప్రయాణిస్తుండగా, వారి కళ్లెదుటే ఓ బస్సు ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకుంది. వెంటనే స్పందించిన హరీశ్, ఆయన స్నేహితులు కారును పక్కకు ఆపి బస్సు వద్దకు పరుగులు తీశారు.

“క్షణం కూడా ఆలోచించలేదు. ఓ రాయి తీసుకుని డ్రైవర్ సీటు పక్కనున్న అద్దాలను బలంగా పగలగొట్టాం. లోపల చిక్కుకున్న వారిని ఒక్కొక్కరిగా బయటకు లాగాం. అలా సుమారు పది మందిని కాపాడగలిగాం. అయితే, క్షణాల్లో మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో ఎక్కువ మందిని రక్షించలేకపోయాం” అని హరీశ్ ఆవేదనతో తెలిపారు.

“కళ్ల ముందే మనుషులు కాలిపోతుంటే చూసి కన్నీళ్లు ఆగలేదు. అవకాశం ఉంటే మరింత మందిని కాపాడేవాళ్లం. ఘోరం జరిగిపోయింది. ఆ మార్గంలో వెళ్తున్న చాలామంది తమ ఫోన్లలో వీడియోలు తీస్తున్నారే తప్ప, మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేయకపోవడం బాధ కలిగించింది” అని ఆయన అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాల్సింది పోయి, కొందరు ప్రేక్షకపాత్ర వహించడంపై విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -