నవతెలంగాణ-హైదరాబాద్: రీల్స్ చేస్తూ ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే కాలుజారీ నదిలోపడిపోయాడు. ఛట్ పూజ వేడుకల నేపథ్యంలో యమునా నది శుభ్రతపై అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యమునా నది శుభ్రతపై అవగాహన కల్పించేందుకు పత్పర్‌గంజ్ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగానే నది ఒడ్డున రీల్ చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పి నదిలోకి పడిపోయారు.
దీనిపై ఆప్ నేత సంజీవ్ ఝా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ నాయకులకు తప్పుడు వాగ్దానాలు చేయడం ఓ వృత్తిగా మారిందంటూ వ్యాఖ్యానించారు. బహుశా అబద్ధాలు, ప్రచార రాజకీయాలతో విసిగిపోయిన యమునా మాత.. స్వయంగా వారిని తన వద్దకు పిలిపించుకున్నట్టుంది అంటూ చురకలంటించారు.



