రెవెన్యూ సమస్యలు సత్వర పరిష్కారం

– రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌
– ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ
– అధికారులతో ప్రత్యేక సమావేశం
– ఎమ్మెల్యే మంచిరెడ్డితో కలిసి సమీక్షించిన కలెక్టర్‌
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.హరీష్‌ తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డితో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఆర్‌ఐలు హాజరయ్యారు. వారి నుంచి వివరాలు సేకరించారు. గ్రామాల వారిగా భూ సమస్యలపై స్థానిక అధికారులతో కలెక్టర్‌, ఎమ్మెల్యే చర్చించారు. గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉండి పహాణీల్లో నమోదై భూమిని సాగు చేసుకుంటున్న వారిని గుర్తించి వారికి తగు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే విన్నవించారు. ఇబ్రహీంపట్నం బాగాయత్‌ సైదాబాద్‌ కంచేలో వివిధ రక్షణరంగా సంస్థలకు కేటాయించిన భూమి పోగా మిగిలిన వారికి ధరణి ద్వారా పాస్‌ పుస్తకాలు అందజేయాలని కలెక్టర్‌కు నివేధించారు. సమగ్ర నివేదిక పంపాలని ఆర్డీఓ అనంతరెడ్డిని కలెక్టర్‌ ఆదేశించారు. దండుమైలారం హాసీజ్‌పూర్‌కు 230ఎకరాల పొలం పట్టా భూమి రైతులకు కొత్త పాసుపుస్తకాలు అందజేయాలని కోరారు. నాగన్‌పల్లి రామోజీ ఫిలీంసిటీ ప్లాట్ల భూమి బయట తీసుకొని సర్టిఫికెట్లున్న వారందరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కోహెడ, పిల్లిగుట్ట భూమి, బాటసింగారం లాజిస్టిక్‌ పార్కు రైతుల ప్లాట్లు, నివాస స్థలాలకు భూముల గుర్తింపు, కాగజ్‌ఘాట్‌, ఆరుట్ల, శేరిగూడ భూ విస్తీర్ణం హెచ్చుతగ్గుల సమస్యలు ప్రత్యేక అధికారుల నివేదికల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించారు. మల్కీజ్‌గూడ రైతుల భూ సమస్య కొలిక్కి వచ్చిందని, కలెక్టర్‌ కార్యాలయం ద్వారా సీసీఎల్‌కి సమగ్ర నివేదిక పంపించామని త్వరలోనే పరిష్కారమవుతుందని ఎమ్మెల్యేకు వివరించారు. గతంలో కొన్ని గ్రామాల్లో ప్రజలను మభ్యపెట్టడానికి నివాసి స్థలాల సర్టిఫికెట్లు ఇచ్చారని, కానీ వారికి ప్లాట్లు కేటాయించలేదని వారికి న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు. కాగజ్‌ఘట్‌కు చెందిన రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. భూదాన భూములుగా కొత్తగా వెలుగులోకి వచ్చిన వాటిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. ధరణి సంబంధిత సమస్యలు రైతులు నేరుగా ఆర్డీవో, తహాసీల్దారులకు వివరించాలని వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్‌ వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, తహసీల్దార్లు అన్వర్‌, శ్రీకాంత్‌ రెడ్డి, ప్రసాద్‌, రవీంద్ర దత్తు, వెంకటేశ్వర్లు, సర్వేయర్లు, ఎంపీపీ కృపేష్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love