నవతెలంగాణ-హైదరాబాద్ : గూఢచర్యానికి పాల్పడుతూ, నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్ నడుపుతోన్న 59 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విదేశీ అణు శాస్త్రవేత్తలతో అతడికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. నిందితుడి పేరు మహమ్మద్ అదిల్ హుస్సైనీ. ఇంకా రెండుమూడు మారుపేర్లతో విదేశాల్లోని అణుశాస్త్రవేత్తలను పలుమార్లు సంప్రదించినట్లు, పాక్ సహా పలు దేశాలకు పర్యటించినట్లు వెల్లడించాయి. అతడు భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నాడని అధికారులు అనుమానిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా అతడి నుంచి అసలు, నకిలీ పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. దేశ భద్రతలో కీలకమైన సంస్థలకు సంబంధించిన ఐడీ కార్డులు కలిగిఉన్నట్లు గుర్తించారు. అతడి నెట్‌వర్క్ ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పుర్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోందని, అక్కడ నకిలీ ఐడీలు, పాస్‌పోర్టులను తయారుచేస్తున్నారని తెలిపారు. రష్యా అణుశాస్త్రవేత్త నుంచి డిజైన్‌ను ఇరాన్ శాస్త్రవేత్తకు విక్రయించినట్లు దర్యాప్తులో భాగంగా అదిల్ వెల్లడించినట్లు సమాచారం. అలా వచ్చిన సొమ్మును దుబాయ్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.
అదిల్‌తో పాటు అతడి సోదరుడు అక్తర్ సున్నితమైన సమాచారాన్ని విక్రయించి, నకిలీ పత్రాల ద్వారా పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్తర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కేఫ్‌ను నడుపుతోన్న మరో అనుమాతుడిని అరెస్టు చేయగా.. నెట్‌వర్క్‌లో భాగమైన మిగిలినవారు పరారీలో ఉన్నారని పోలీసు అధికారి ప్రమోద్‌సింగ్ కుశ్వాహ్ మీడియాకు వెల్లడించారు. ఈ నెట్‌వర్క్ ద్వారా ఎంతమందికి నకిలీ పాస్‌పోర్టులు అందాయనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు.



