– వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా
అనుమతి లేని స్పెషల్ స్కూల్స్, ఆటీజం, స్పీచ్, హియరింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి : ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలని, కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో మంగళవారం వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. వికలాంగుల సమస్యలపై నినాదాలతో డైరెక్టర్ కార్యాలయం దద్దరిలింది. ధర్నా వద్దకు జీఎం ప్రభంజన్‌రావు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లా డుతూ.. 2016 ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం, 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వికలాంగ మహిళలపై లైంగికదాడులు, వేధింపులు పెరుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల కార్పొరేషన్‌ను, టీసీపీసీ సెంటర్స్‌ను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్స్, స్పీచ్, హియరింగ్, స్పెషల్ స్కూల్స్‌లలో ఫీజులను నియంత్రించాలని, అనుమతి లేకుండా నడుస్తున్న కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే రూ.5లక్షల ప్రోత్సాహం, జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, ఐదెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని అన్నారు. ఆర్టీసీలో ఉచిత బస్ సౌకర్యం కల్పించాలన్నారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌సీ కేంద్రాల్లో సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల కోసం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేష్ మాట్లా డుతూ.. వికలాంగుల పెన్షన్ రూ.6వేలకు పెంచాలని, తీవ్ర వైకల్యం కలిగిన వారికి రూ.25వేల ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని కోరారు.
వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తాం : జీఎం హామీ
వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తామని వికలాంగుల కార్పొరేషన్ జీఎం ప్రభంజన్‌రావు హామీచ్చారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే పారితోషికం ఇచ్చే విషయంలో కృషి చేస్తున్నామన్నారు. 49 డిమాండ్స్‌పై డైరెక్టర్‌తో చర్చించి సమావేశం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ కేంద్ర కమిటీ సభ్యులు సి.సాయమ్మ, జె.రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉపేందర్, స్వామి, అరిఫా, మధు బాబు, సహాయ కార్యదర్శులు కాషాప్ప, రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల వికలాంగులు పాల్గొన్నారు.
సామాజిక భద్రత కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES