Wednesday, May 14, 2025
Homeప్రధాన వార్తలుటీ కప్పులో తుపాను..?

టీ కప్పులో తుపాను..?

- Advertisement -

– చర్చనీయాంశమైన హరీశ్‌రావు వ్యాఖ్యలు
– కేసీఆర్‌, కేటీఆర్‌తో గ్యాప్‌ అంటూ వార్తలు
– అదేమీ లేదంటూ కొట్టిపారేసిన ట్రబుల్‌ షూటర్‌
– వరంగల్‌ సభకు అంటీముట్టనట్టుగా ఉన్న వైనం
– ఆ తర్వాత సిద్దిపేటకే పరిమితం
– తాజాగా పార్టీ నిర్ణయమే ఫైనల్‌ అంటూ స్పష్టీకరణ
– కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానంటూ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వరంగల్‌లో ఏప్రిల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ చూసిన వారెవరికైనా ఓ విషయం ఇట్టే అర్థమై ఉంటుంది. ఆ సభ సన్నాహక సమావేశాల్లోగానీ, నిర్వహణ, ఏర్పాట్ల లోగానీ ఆ పార్టీ ట్రబుల్‌ షూటర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రమేయం లేకపోవటమే. పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ ప్రతీ సందర్భంలోనూ, ప్రతీ వేదికమీదా కనబడిన ఆయన… మొన్నటి సభకు సంబంధించిన కార్య కలాపాలకు దూరంగా ఉండటం తీవ్ర చర్చ నీయాంశమైంది. దీంతో ఆయన అనుయా యులు, అభిమానులు తీవ్ర నైరాశ్యానికి గుర య్యారు. రజతోత్సవ సభను ఘట్‌కేసర్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్వహించాలంటూ తొలుత హరీశ్‌ సూచించారు. కానీ అందుకు భిన్నంగా వరంగల్‌లో ఆ సభను నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. దాంతోపాటు సభ నిర్వహణ బాధ్యతలను హరీశ్‌కు కాకుండా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అప్పగించారు. నిధుల సమీకరణ, పనుల పర్యవేక్షణ బాధ్యతలను వరంగల్‌ జిల్లాకు చెందిన నేతలకు గులాబీ బాస్‌ కట్టబెట్టారు. దీంతో కినుక వహించిన హరీశ్‌… ఆ సభకు సంబంధించి హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశాలు, సమీక్షలకు దూరంగా ఉన్నారు. ‘మనకు పని అప్పగించనప్పుడు మనమెందుకు జోక్యం చేసుకోవాల్లే…’ అనే పద్ధతుల్లో ఆయన వ్యవహరించారు. ఈ క్రమంలో ఎక్కువ రోజులు సిద్దిపేట నియోజకవర్గానికే పరిమిత మయ్యారు. మధ్యలో రెండూ మూడు రోజులు తిరుపతి వెళ్లి, దైవదర్శనం చేసుకుని వచ్చారు. ఈ క్రమంలో గులాబీ బాస్‌కు, ట్రబుల్‌ షూటర్‌కు గ్యాప్‌ పెరుగుతోందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు భవిష్యత్తులో ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆరే.. పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్‌ పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. దీంతో బీఆర్‌ఎస్‌లో అధిష్టానానికి, హరీశ్‌కు ఏమాత్రం పొసగటం లేదంటూ రాజకీయ విశ్లేషకులు ఒక అంచనాకొచ్చారు. ఈ నేపథ్యంలో ‘టీ’ కప్పులో తుపాను మొదలైందంటూ సామాజిక మాధ్యమాల్లో సైతం విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో గులాబీ దళపతి నుంచి ఆదేశాలు అందాయో లేక తుపాను చల్లారిందో తెలియదు గానీ…మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హరీశ్‌రావు… ‘నేను పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ ఆదేశాలను పాటించే క్రమశిక్షణగల కార్యకర్తను. పార్టీ నిర్ణయాలను, కేసీఆర్‌ నిర్ణయాలను శిరసావహిస్తాను తప్పితే, వాటిని జవదాటను…’ అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ తర్వాత పార్టీ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తే స్వాగతిస్తా, సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. తనపై సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నానని హరీశ్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై తమ పార్టీ నేతలు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారని వివరించారు. మొత్తం మీద ‘టీ’ కప్పులో తుపాను చల్లారినట్టేనా? లేదా? అనేది వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -