Wednesday, May 14, 2025
Homeప్రధాన వార్తలుకొలిక్కిరాని ఫీజు!

కొలిక్కిరాని ఫీజు!

- Advertisement -

– ఇంజినీరింగ్‌ రుసుం పెంపుపై టీఏఎఫ్‌ఆర్సీ కసరత్తు
– అధికారుల మధ్య కుదరని ఏకాభిప్రాయం
– మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయం
– అత్యధిక ఫీజు రూ.2.45 లక్షలు
– అత్యల్పం రూ.45 వేలు
– ప్రతిపాదనలు సిద్ధం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఫీజుల ఖరారుకు సంబంధించి అధికారులు తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే ఇంజినీరింగ్‌ కాలేజీల ఫీజులను పెంచడంపై తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) కసరత్తు చేస్తున్నది. మంగళవారం హైదరాబాద్‌లో టీఏఎఫ్‌ఆర్సీ సమావేశం జరిగింది. ఇందులో టీఏఎఫ్‌ఆర్సీ చైర్మెన్‌ గోపాల్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనతోపాటు ఆర్థిక శాఖ అధికారి, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులు 2024-25 విద్యాసంవత్సరంతో ముగిశాయి. 2025-26, 2026-27, 2027-28 విద్యాసంవత్సరాలకు సంబంధించి కొత్త ఫీజులు ఖరారు చేయాల్సి ఉంటుంది. దీనిపైనే టీఏఎఫ్‌ఆర్సీ కసరత్తు ప్రారంభించింది. కాలేజీల వారీగా ఫీజుల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఫీజులను పెంచడానికి ఉన్న హేతుబద్ధమైన కారణాలు ఏంటో చెప్పాలని ఆర్థిక, విద్యాశాఖ అధికారులు టీఏఎఫ్‌ఆర్సీ అధికారులను అడిగినట్టు తెలిసింది. ఏ ప్రాతిపదికన కాలేజీలకు ఫీజులను ఖరారు చేశారు, పెంచడానికి ఉన్న కారణాలను వివరించాలని కోరినట్టు సమాచారం. కాలేజీల ఆడిట్‌ నివేదికలు, ఆదాయ, వ్యయాలను పరిశీలిస్తున్నారు. ఒక కాలేజీకి 80 శాతం, మరో కాలేజీకి 70 శాతం, ఇంకో కాలేజీకి అసలు ఫీజులను పెంచకపోవడమేంటనీ ప్రశ్నించినట్టు తెలిసింది. అందుకే కాలేజీల వారీగా ఫీజులను ఖరారు చేయాలంటే మరోసారి సమావేశాన్ని నిర్వహిం చాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈలోగా ఫీజుల పెంపునకు తీసుకున్న చర్యలు, అందుకు గల కారణాలను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని టీఏఎఫ్‌ఆర్సీని కోరినట్టు తెలిసింది. టీఏఎఫ్‌ఆర్సీ రూపొందించిన ప్రతిపాదనలను ఆర్థిక, విద్యాశాఖ అధికారులు అంగీకరించకపోవడంతో ఫీజుల పెంపు ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫీజుల పెంపు ప్రక్రియ కొలిక్కి వస్తే ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలకు మార్గం సుగమం అవుతుంది. ఇదిలా ఉండగా ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఇచ్చేందుకు జేఎన్టీయూ హైదరాబాద్‌తోపాటు ఓయూ, కేయూ అధికారులు తనిఖీలు చేపట్టారు. త్వరలోనే వాటికి అనుబంధ గుర్తింపు రానుంది.
భారీగా పెరిగే అవకాశం
ఇంజినీరింగ్‌ ఫీజులు భారీగా పెరిగే అవకాశమున్నది. రాష్ట్రంలో కొత్త ఫీజుల కోసం 157 ఇంజినీరింగ్‌ కాలేజీలు టీఏఎఫ్‌ఆర్సీకి దరఖాస్తు చేశాయి. ఇంజినీరింగ్‌ కాలేజీల గరిష్ట ఫీజు రూ.2.45 లక్షలు, అత్యల్ప ఫీజు రూ.45 వేలు ఉండాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ ఫీజులు ఇంకా ఖరారు కాలేదు. సుమారు 45 కాలేజీల ఫీజు రూ.రెండు లక్షలు దాటే అవకాశమున్నది. రాష్ట్రంలో అత్యధికంగా ఎంజీఐటీ ఫీజు రూ.1.60 లక్షల నుంచి రూ.2.45 లక్షల వరకు పెరగనుంది. సీబీఐటీ ఫీజు రూ.1.65 లక్షల నుంచి రూ.2.23 లక్షల వరకు, వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి ఫీజు రూ.1.35 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు, వాసవి కాలేజీ ఫీజు రూ.1.40 లక్షల నుంచి రూ.2.15 లక్షల వరకు, ఎస్‌ఆర్‌ కాలేజీ ఫీజు రూ.1.30 లక్షల నుంచి రూ.రెండు లక్షల వరకు, సీవీఆర్‌ కాలేజీ ఫీజు రూ.1.50 లక్షల నుంచి రూ.1.98 లక్షల వరకు, జి నారాయణమ్మ ఫీజు రూ.లక్ష నుంచి రూ.1.95 లక్షల వరకు, వర్ధమాన్‌ కాలేజీ ఫీజు రూ.1.40 లక్షల నుంచి రూ.1.90 లక్షల వరకు, కిట్స్‌ (వరంగల్‌) ఫీజు రూ.1.25 లక్షల నుంచి రూ.1.90 లక్షల వరకు, శ్రీనిధి ఫీజు రూ.1.30 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు, బీవీఆర్‌ఐటీ ఫీజు రూ.1.20 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -