Thursday, May 15, 2025
Homeరాష్ట్రీయంనేడు, రేపు పలు జిల్లాల్లో వడగండ్ల వానలు

నేడు, రేపు పలు జిల్లాల్లో వడగండ్ల వానలు

- Advertisement -

– ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ
– నికోబార్‌ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనీ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో వడగండ్లతో కూడిన వాన పడే సూచనలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న హెచ్చరించారు. బుధవారం నాడు ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో పాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశమున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేశారు. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కా జిగిరి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే సూచనలున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు కూడా ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక విడుదల చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వచ్చే 48 గంటల పాటు సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే సూచనలు బలంగా ఉన్నాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 30కిపైగా ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో అత్యధికంగా 2.15 సెంటీమీటర్ల వాన పడింది. మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, హన్మ కొండ, జనగాం, వరంగల్‌, రాజన్నసిరిసిల్ల, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్‌, కామారెడ్డి, నారాయణపేట, మెదక్‌, వికారాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, తదితర జిల్లాల్లో వర్షం కురిసింది.
చురుగ్గా నైరుతి రుతుపవనాలు
అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశిం చాయి. రాబోయే నాలుగు రోజుల పాటు నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ బంగాళా ఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు, అండమాన్‌ నికోబార్‌ దీవులకు పూర్తిగా విస్తరించే అవకాశముంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -