నవతెలంగాణ-హైదరాబాద్ : పడవ బోల్తా పడి ఎనిమిది మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బహ్రైచ్ జిల్లాలోని దట్టమైన అడవి ప్రాంతమైన భరతాపూర్ గ్రామం సమీపంలోని కౌడియాలా నది బుధవారం రాత్రి ఓ పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 60 ఏళ్ల మహిళతో పాటు ఐదుగురు పిల్లలతో సహా 8 మంది దుర్మరణం పాలయ్యారు. లఖీంపూర్ ఖీరీ జిల్లా ఖైరతియా గ్రామానికి చెందిన 22 మంది భరతాపూర్ వెళ్లేందుకు పడవలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే, నది ప్రవాహం బలంగా ఉండటంతో పడవ తలక్రిందులైందని స్థానికులు తెలిపారు. లక్నో నుంచి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం పడవలోని 22 మందిలో 13 మందిని కాపాడగా.. రమజియా (60), మిహిలాల్ యాదవ్ (38), శివనందన్ మౌర్య (50), సుమన్ (28), సోహ్నీ (5), శివం (9), శాంతి కుమార్తె (5) రమజియా మనవడు (7), మరో మనవడు (10) ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. పోలీసులు, ప్రజాప్రతినిధులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. రక్షణ, ఉపశమన కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచించారు.



