నవతెలంగాణ ఖమ్మం: మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు ఖమ్మంలోని ‘మున్నేరు’ పరివాహకంలోని కాలనీలను వరద చుట్టుముట్టింది. ఎగువన భారీ వర్షాలతో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. రాత్రి 7 గంటల వరకు 18 అడుగుల వద్ద ఉన్న మున్నేరు అర్ధరాత్రి 12 గంటలకు 21 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అధికారులు ముంపు ప్రాంతాలైన బొక్కలగడ్డ, మోతి నగర్ ప్రాంతాల ప్రజలను ప్రత్యేక వాహనాల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం నీటిమట్టం 24.7 అడుగులకు చేరింది. మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వరద నీరు ఖమ్మం-బోనకల్ ప్రధాన రహదారిపై చేరింది. ఖమ్మం నగరం సమీపంలోని దంసలాపురం వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై మూడు అడుగుల మేర నీరు వచ్చి చేరింది. దీంతో పోలీసులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. చింతకాని మండలం రామకృష్ణాపురం సమీపంలో దిగువ వంతెనపై వరద ప్రవహిస్తోంది. పాలేరు జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీల్లోకి వరద చేరింది. మోతీనగర్‌లోని 35, బొక్కలగడ్డలో 57 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఖమ్మంలోని రాపర్తి నగర్ బీసీ కాలనీ వద్ద డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారి కొట్టుకుపోయింది. టీఎన్జీవోస్ కాలనీని నలువైపులా వరద నీరు ముంచెత్తడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతంలోని ఏదులాపురం పరిధిలో కేబీఆర్ నగర్, ప్రియదర్శిని కళాశాల ప్రాంతంలో ఉన్న ఇండ్ల చుట్టూ వరద నీరు చేరింది.




