Thursday, October 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్..

హైదరాబాద్‌లో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారతీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటించిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ హైదరాబాద్‌లో మరోసారి తన మ్యూజిక్ మేజిక్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వేదికలపై లైవ్ కచేరీలతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన రెహమాన్, ఈసారి హైదరాబాద్ ప్రజలకు ప్రత్యేక మ్యూజిక్ అనుభూతిని అందించడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ టాకీస్ ఆధ్వర్యంలో నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీ లో గ్రాండ్ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. ఈ విషయాన్ని బుధవారం హైదరాబాద్ టాకీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకలో రెహమాన్ తన సూపర్‌హిట్ పాటలను ప్రత్యక్షంగా ఆలపించనుండటంతో అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది.

ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. “హైదరాబాద్ ఒక డైనమిక్ సిటీగా నిరంతరం అభివృద్ధి చెందుతోంది. లైవ్ కాన్సర్ట్‌లకు ఇక్కడ ప్రజలు చూపుతున్న ఆదరణ నిజంగా అద్భుతం. ఏఐ ప్రభావం పెరుగుతున్న ఈ కాలంలో, ప్రేక్షకులు ఇంకా నిజమైన సంగీత అనుభూతి కోసం లైవ్ కాన్సర్ట్‌లకు రావడం కళాకారులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. ఇది మన సంగీత పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం” అని చెప్పారు. ఇక హైదరాబాద్ టాకీస్ వ్యవస్థాపకుడు సాయినాథ్ గౌడ్ మాట్లాడుతూ.. “మా లక్ష్యం ఎల్లప్పుడూ ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సంగీత అనుభవాన్ని అందించడమే. ఈ ఏడాది ఆరంభంలో ఎం.ఎం. కీరవాణిని ఆతిథ్యం ఇచ్చాము. ఇప్పుడు ఏఆర్ రెహమాన్‌ను రెండోసారి నగరానికి తీసుకురావడం గర్వకారణం. దీని కోసం దీపక్ చౌదరి, ఇవా లైవ్ సంస్థలతో కలిసి పని చేస్తున్నాం” అని తెలిపారు. మొత్తానికి సంగీత ప్రియులందరికీ నవంబర్ 8 నిజమైన పండుగ రోజుగా మారబోతోంది. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఏఆర్ రెహమాన్ స్వరాలు మార్మోగబోతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -