– సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ : తుఫాను ప్రభావంతో నష్టపోయిన వివరాలను సేకరించి సమన్వయంతో అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. గురువారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మొంధా తుఫాన్ దాటికి దెబ్బతిన్న రోడ్లను ఆర్ అండ్ బి శాఖ అధికారులు గుర్తించాలన్నారు. రైతులు ధాన్యం రవాణాకు ఇబ్బంది కలగకుండా గ్రామాల నుంచి వచ్చే రోడ్లలో గుంతలను గుర్తించి తక్షణమే మరమ్మత్తులు చేయాల ని సూచించారు.బిముఖ్యంగా పంట చేతికి వచ్చే వేళ తుఫాను రైతన్న తీవ్ర నిరాశకు, ఇబ్బందులకు గురిచేసిందని రైతులకు అధికారులు అండగా నిలవాలని కోరారు. పంట నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా ప్రతీ గ్రామానికి వెళ్లి పంట పొలాలను పరిశీలించి సర్వే నిర్వహించి నివేదికలు అందజేయాలన్నారు. గాలి కి తెగిపోయిన కరెంట్ లైన్స్, పోల్స్ అన్నిటిని గుర్తించి వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
మిల్లర్లు పెద్ద మనసుతో రైతు సంక్షేమం కోసం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్స్ ను కోరారు. మిల్లుల వద్ద రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గ్రామస్థాయిలో ఏ సమస్యలున్న గుర్తించి సంబంధిత అధికారులకు తెలియచెప్పే బాధ్యతను ఉపాధ్యాయులు చేపట్టాలన్నారు.
అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుందని అందులో అధికారులు గుర్తించిన సమస్యలను, చేపట్టిన చర్యలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి రాజశేఖర్ రాజు ఎంపీడీవో శేషగిరి శర్మ, తహసిల్దార్ సురేష్ కుమార్ ఇన్చార్జి ఏ డి ఏ సైదా నాయక్, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణ చౌదరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



