నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలంలోని ఆలూర్–గుత్ప గ్రామాలను కలిపే రహదారిపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. బుధవారం అర్ధరాత్రి నుండి కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారి పూర్తిగా మునిగిపోయింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఎంపీవో రాజలింగం,గుత్ప పంచాయతీ కార్యదర్శి రానా తరుణం రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఎవరూ ఆ బ్రిడ్జ్‌పై లేదా రహదారిపై ప్రయాణించవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. వరద ఉధృతి కొనసాగుతున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. స్థానికులు పరిస్థితిని అంచనా వేసుకొని అధికారుల సూచనలను తప్పక పాటించాలని కోరారు.

 
                                    