నవతెలంగాణ – వాషింగ్టన్ : హెచ్1బి వీసా ఫీజును భారీగా పెంచిన కొన్ని వారాల్లోనే.. అమెరికా విదేశీ వలసదారులపై మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు అవసరమైన ఉపాధి అధికార పత్రాలు- వర్క్ పర్మిట్లు (ఇఎడి) ఆటోమేటిక్ పొడిగింపును రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇది పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ వలసదారులు మరియు కార్మికులపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. వలసలను అరికట్టే తాజా ప్రయత్నాలలో భాగంగా .. వారి ఉపాధి అధికారాలు లేదా వర్క్ పర్మిట్లు అనుమతుల చెల్లుబాటును పొడిగించే ముందు ”ఏలియన్స్ (విదేశీయులు) సరిగా పరీక్షించడం మరియు తనిఖీ చేయడం” ప్రాధాన్యతగా తీసుకున్నట్లు యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీస్ (డిహెచ్‌ఎస్) బుధవారం ప్రకటన విడుదల చేసింది. తాజా నిబంధనల ప్రకారం..2025 అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత తమ ఇఎడిని పునరుద్ధరించడానికి దాఖలు చేసే విదేశీయులకు ఇకపై ఆటోమేటిక్ పొడిగింపు లభించదని డిహెచ్‌ఎస్ ఆప్రకటనలో తెలిపింది.
ఒక ఏలియన్ ఉద్యోగ అధికారం లేదా డాక్యుమెంటేషన్ పొడిగించబడే ముందు తగిన పరిశీలన మరియు స్క్రీనింగ్ పూర్తయిందని నిర్థారించుకోవడం సాధారణ చర్య. అయితే అమెరికాలో పనిచేయడం అనేది ఒక హక్కుకాదు, ఒక అవకాశం అని ఏలియన్స్ గుర్తుంచుకోవాలని యుఎస్‌సిఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో తెలిపారు. దీంతో అమెరికాలో పనిచేయడానికి ఉపాధి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులను తరచుగా తనిఖీ చేయాల్సి వుంటుంది.
ఈ నిర్ణయంతో హెచ్1బి, ఎల్, ఇ వీసాదారుల భాగస్వామ్యులు, శరణార్థి లేదా శరణార్థి హోదా కలిగిన విదేశీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. తాజా నిబంధనల ప్రకారం.. వర్క్‌పర్మిట్ల గడువు ముగియడానికి 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తులు సమర్పించాలని డిహెచ్‌ఎస్ విదేశీయులకు సూచించింది. అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్లను పునరుద్ధరించేందుకు దరఖాస్తు చేసుకునే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదని తెలిపింది. అయితే ఈ తేదీ కంటే ముందు వర్క్ పర్మిట్లను పొండిగించుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని డిహెచ్‌ఎస్ ప్రకటించింది. బైడెన్ ప్రభుత్వ హయాంలో .. పాత నిబంధనల ప్రకారం వర్క్ పర్మిట్లను పునరుద్ధరించడానికి సకాలంలో ఫారమ్ 1-765ని దాఖలు చేసే విదేశీయులు 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపును పొందేవారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు సెప్టెంబర్ 19న హెచ్1బి వీసాల ఫీజును పెంచుతూ ఒక ప్రకటనపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అమెరికా సెన్సస్ డేటా ప్రకారం.. 2022 నాటికి అమెరికాలో సుమారు 4.8మిలియన్లు (48 లక్షల మంది) భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. ఇందులో 66శాతం మంది భారతీయ అమెరికన్లు వలసదారులు కాగా, 34 శాతం మంది అమెరికాలో జన్మించిన వారు.



