కలెక్టర్ బి ఎం సంతోష్
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాలలో రూ.33.02 కోట్ల నిధులతో నిర్మించిన నర్సింగ్ కళాశాల, వసతి గృహ భవనాల మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నర్సింగ్ కళాశాలతో పాటు, మెడికల్ కళాశాల విద్యార్థుల వసతిగృహ ఏర్పాట్ల పనులు, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..నవంబర్ నెలలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చేతులమీదుగా నర్సింగ్ కళాశాల, వసతి గృహ భవనాల ప్రారంభోత్సవం తో పాటు రూ .130 కోట్ల నిధుల అంచనా తో మెడికల్ కళాశాల, వసతి గృహ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాల విద్యార్థినిలు ఉండే వసతి గృహంలో ఇంకా అవసరమైన మౌలిక వసతులు ఏమైనా ఉంటే వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. మెడికల్ కళాశాల సమీపంలోనే నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన పనులు కూడా వేగవంతం చేయాలని, త్వరలోనే తాను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తానన్నారు. నర్సింగ్ కళాశాల చుట్టూ ప్రహారీ నిర్మాణం, ఇతర పనులు చేసేందుకు ప్రతిపాదనలు పంపిస్తే అవసరమైన నిధుల మంజూరుకు ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు.
ఈ సమావేశంలో టీజీఎంఎస్ ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణుగోపాల్, డిప్యూటీ ఈఈ శ్రీనివాసులు, ఏఈ రహీం, మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ కవిత, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిర, తదితరులు పాల్గొన్నారు.



