నవతెలంగాణ-హైదరాబాద్: కర్నాటకలోని హుబ్లీలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం రాత్రి నుంచి కురిసిన వానాలకు పలు లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. పలు ఇండ్లలోకి భారీగా నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా పలు కాలనీల్లో వరద ప్రవాహానికి ఇండ్లలోని వస్తువులు కొట్టుకుపోయాయి. పలు కార్లు బురద నీటిలో కురుకుపోగా..మరికొన్ని ధ్వంసమైయ్యాయి. హుబ్బళ్లి-ధార్వాడ్ బైపాస్‌లోని రాయనాల్ అండర్‌పాస్ వద్ద పెను ప్రమాదం తప్పింది. 13 మంది ప్రయాణికులతో పాటు రెండు కార్లతో ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్ నీటితో నిండిన సర్వీస్ రోడ్డులోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మరోవైపు భారీ వర్షాలకు పలు రోడ్డు మార్గాలు నీటితో నిండిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. అప్రమత్తమైన కర్నాటక ప్రభుత్వం ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రారంభించింది. ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం రంగంలోకి దిగింది.

