నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రముఖ నటుడు విజయ్ నాయకత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో జన నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు ‘తొండర్ అని’ (వలంటీర్ల బృందం) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన రోడ్‌షోలో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం నేపథ్యంలో, భారీగా తరలివచ్చే జనసందోహాన్ని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణంగా పార్టీ గుర్తించింది. డీఎంకే, ఎండీఎంకే వంటి పార్టీల తరహాలో తమకూ ఒక శిక్షణ పొందిన వలంటీర్ల బృందం అవసరమని భావించి, ‘తొండర్ అని’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
ఈ కొత్త విభాగం పార్టీ కార్యక్రమాల సమయంలో జనసమూహాన్ని క్రమబద్ధీకరించడం, భద్రతా వలయాలు ఏర్పాటు చేయడం, స్థానిక పోలీసులు, వైద్య బృందాలతో సమన్వయం చేసుకోవడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. దీని కోసం ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఏడుగురు రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారులు చేపట్టారు. వీరిలో రిటైర్డ్ ఏడీజీపీ వి.ఎ. రవికుమార్ (ఐపీఎస్) సహా పలువురు డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. జనసమూహాన్ని నియంత్రించే మెలకువలు, భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై వీరు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. “మా పార్టీ క్రమశిక్షణ, వ్యవస్థాగత పనితీరుకు మారుపేరుగా నిలవాలని విజయ్ ఆకాంక్షిస్తున్నారు. మా కార్యక్రమాలు ప్రజలకు సురక్షితంగా ఉండేలా ‘తొండర్ అని’ చూసుకుంటుంది” అని ఓ సీనియర్ నేత వివరించారు. ఈ విభాగంతో పాటు 65 జిల్లాల్లో విద్యార్థి, మహిళా విభాగాలకు కూడా పార్టీ ఆఫీస్ బేరర్లను నియమించింది. ఇటీవల తమిళనాడు వ్యాప్తంగా విజయ్ సభలకు రికార్డు స్థాయిలో జనం తరలివస్తుండటంతో, వారి భద్రతకు ఇలాంటి పటిష్టమైన యంత్రాంగం అవసరమని పార్టీ భావిస్తోంది.

                                    

