నవతెలంగాణ-హైదరాబాద్: పోలింగ్ తేదీన ప్రత్యర్థులను ఓటు వేయకుండా అడ్డుకోవాలని చెప్తున్న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ ‘లలన్‌సింగ్’ వీడియో ఒకటి మంగళవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో రాజీవ్ రంజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంగేల్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే మోకామా నుండి వచ్చినట్లు సమాచారం. ”పోలింగ్ రోజున బయటకు వెళ్లేందుకు అనుమతించకూడని వ్యక్తులు కొందరు ఇక్కడ ఉన్నారు. వారిని ఇళ్లలోనే బంధదించాలి. మిమ్మల్ని బెదిరిస్తే.. మీతో పాటే పోలింగ్ బూత్‌లకు ఈడ్చుకువెళ్లి, ఓటు వేయించి, తిరిగి ఇళ్లకు చేరేలా చూడాలి” అని లలన్ సింగ్ తన మద్దతుదారులను హెచ్చరిస్తుండటం తాజా వీడియోలో వినిపిస్తోంది.
తాజా వీడియోపై ఆర్‌జెడి, కాంగ్రెస్‌లు తీవ్రంగా స్పందించాయి. ”ఎలక్షన్ కమిషన్ (ఈసి)పై బుల్డోజర్ నడుపుతూ ప్రజలను ఓటు వేయకుండా అడ్డుకోవాలని లలన్ సింగ్ వీడియోలో బెదిరిస్తున్నారు. మరణించిన ఈసి ఎక్కడ ఉంది” అని ఆర్‌జెడి విమర్శించింది. ”ఇది బీహార్‌లో గూండాగిరి, అడవి రాజ్ పాలనకు కొత్త ఉదాహరణ. ఓటమి భయంతో బిజెపి, జెడి(యు)నేతలు పోలింగ్ రోజున ప్రజలను ఇళ్లలో బంధించాలని, ప్రతిఘటిస్తే. ఓటు వేయడానికి వారిని ఈడ్చుకెళ్లాలని బహిరంగంగా చెబుతున్నారు” అని సీనియర్ కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ఎక్స్‌లో పేర్కొన్నారు.
రాజీవ్ రంజన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు
ప్రతిపక్ష నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాజీవ్ రంజన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడు దులార్ చంద్ యాదవ్ హత్యకేసులో అనంత్ సింగ్, అతని ఇద్దరు సహచరులు-మణికాంత్ ఠాకూర్, రంజీత్ రామ్‌లను గతవారాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోకామా ప్రాంతంలో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి తరపున ప్రచారం చేపడుతుండగా దులార్ చంద్ యాదవ్ హత్యకు గురయ్యాడు. ఉపముఖ్యమంత్రి అభ్యర్థి సామ్రాట్ చౌదరితో కలిసి లలన్ సింగ్ సోమవారం మోకామాలో అనంత్ సింగ్ తరపున ప్రచారం నిర్వహించారు. హత్య కేసులో అనంత్‌సింగ్‌ను కుట్ర పూరితంగా ఇరికించారని, ఆయన పోలీసులకు సహకరించారని లలన్‌సింగ్ పేర్కొన్నారు. అనంత్ సింగ్‌ను సమర్థించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.



