- జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-పెద్దవంగర: విపత్తుల నిర్వహణ పై అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వేణుమాధవ్, తహశీల్దార్ మహేందర్‌తో కలిసి మంగళవారం విపత్తు నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. వరద నీటిలో ప్రవేశించవద్దని, వరద నీటిలో నడవొద్దన్నారు. వరద ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఓపెన్ డ్రెయిన్లు, మ్యాన్‌హోల్స్ వద్ద ఎర్ర జెండాలు, బ్యారికేట్లు ఏర్పాటు చేయాలని, ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్, మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


