తెల్లవారు జామున ప్రయాణాలు వద్దు
నవతెలంగాణ-మల్హర్ రావు:
శీతాకాలం ప్రారంభమైంది. పొగ మంచు కమ్ముకుంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలికాలంలో ఆరోగ్య సమస్యలతో పాటు మంచు కారణంగా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచి స్తున్నారు. అసలే చలికాలం..వారం రోజుల నుంచి వాతా వరణం చల్లగా ఉంది. అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జామున ఎటు చూసినా పొగమంచు కనిపిస్తుంది. సామాన్య ప్రజలతో పాటు వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు.పొగమంచు కురుస్తునప్పుడు జాగ్రత్తలు పాటించడం మంచిది.
జాగ్రత్తలు పాటించాలి..
మంచు కురిసే వేళలో రోడ్డుపై ఎదురుగా వస్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించవు.మంచు కమ్ముకున్నప్పుడు వాహనాలు అతివేగంగా నడపరాదు. వేగం వల్ల వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించవు. నియంత్రణ సాధ్యం కాక ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. తెల్లవారు జామున ప్రయాణాలు తగ్గించాలి.వాహనానికి ఎక్కువ వెలుతురు ఉన్న హెడ్లైట్స్ వల్ల ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఫాగ్లిట్స్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
వాహనానికి మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి.బ్రేక్ వేసే ముందు వెనుకాల వస్తున్న వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హైవేలు, ప్రధాన రహదారులపై వాహనాలు పార్కింగ్ చేయరాదు. పొగమంచులో డ్రైవింగ్ చేసే సమయంలో ఎప్పుడు ఓవర్టేక్ చేయరాదు. డ్రైవింగ్ చేసే సమయంలో ఎక్కవ సౌండ్తో పాటలు వినడం లాంటివి చేయ కూడదు. మూల మలుపుల వద్ద ఇండికేటర్స్ వేయాలి. ఇలా చేయడం వల్ల ప్రమాదాలను తగ్గించవచ్చు.
చెవిలో చల్ల గాలిపోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముక్కు, నోరు, చెవులు కప్పిఉండేలా మాస్క్, మంకీ క్యాప్లు ధరించాలి. పొగమంచు ఉన్నప్పుడు ఎండ వచ్చే వరకు వాకింగ్ ఇతర వ్యాయామాలు చేసుకోవడం మంచిది.



