నవతెలంగాణ – ఉప్పునుంతల : శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై వెల్టూరు స్టేజ్ వద్ద బుధవారం ఉప్పునుంతల మండల ఎస్సై వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్సిడెంట్లకు కారణమయ్యే అంశాలు, వాటి నివారణ చర్యలు, ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకర చర్యలను నివారించాలన్నారు.
అలాగే ప్రమాదం సంభవించిన వెంటనే పోలీసులకు,108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించడం, గాయపడిన వారిని “గోల్డెన్ అవర్”లో ఆసుపత్రికి తరలించడం ఎంత ముఖ్యమో తెలిపారు. ఈ కార్యక్రమంలో హైవే పేట్రోలింగ్ సిబ్బంది, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



