Thursday, November 6, 2025
E-PAPER
Homeజిల్లాలుపత్తి రైతులు విలవిల...

పత్తి రైతులు విలవిల…

- Advertisement -

•అకాల వర్షాలతో ఆగమాగం 

•పత్తి కొనుగోలు చేయని సిసిఐ 

•సాగుకు లక్షల్లో పెట్టుబడులు

•వరి,పత్తి పంటలతో రైతు కంటతడి 

నవతెలంగాణ-మర్రిగూడ

ఆరుగాలం కష్టపడి పండించి చేతికొచ్చిన పంట అకాల వర్షాలతో తమ కండ్ల ముందే ఆగమాగం అవుతుంటే అన్నదాత కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు. తన గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక దీనంగా వరుణ దేవుడి వైపు చూస్తున్నాడు. మండల వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ కి 22,100 ఎకరాలలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. మండలంలో ప్రధానంగా రైతులు పత్తి పంటనే సాగు చేస్తారు.పత్తి పంటకు దిగుబడి ఎక్కువ రావడానికి రెండు దపాలుగా రైతులు అడుగుపిండిని వేస్తూ ఉంటారు. ఈసారి యూరియా కొరతతో పంటకు యూరియా కంటెంట్ తగ్గడంతో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి దిగుబడి శాతం కూడా తగ్గిందని రైతులంటున్నారు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు రైతుకు శాపంగా మారాయి. గత 20 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పత్తి తీయకపోవడంతో చేలల్లోనే పత్తి మొలకెత్తుతున్నాయి. ఇక సీసీఐ కేంద్రాలకు తెచ్చిన పత్తిని కూడా తేమ శాతం ఎక్కువ ఉందన్న సాకుతో పత్తిని కొనుగోలు చేయకపోవడంతో  అటు వర్షాలతో పత్తి కరాబై,ఇటు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

కపాస్ కిసాన్ యాప్ తో కష్టాలు 

పత్తి కొనుగోలు చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ సారి కపాస్ కిసాన్ యాప్ ను తీసుకువచ్చింది. ఆ యాప్ ద్వారానే కొనుగోలు చేపట్టాలని నిబంధనలు పెట్టింది. మండలంలో అధిక శాతం రైతులు నిరక్షరాస్యులే ఉన్నారు.వారికి స్మార్ట్ ఫోన్ లేకపోగా ఉన్న డబ్బా ఫోన్ కూడా సరిగ్గా వాడటం రాదు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా కొనుగోలు ఏ విధంగా చేపట్టాలో అర్థం కాక రైతులు అయోమయంలో ఉన్నారు. కపాస్ కిసాన్ యాప్ ను తొలగించి గతంలో మాదిరిగా కొనుగోలు చేపట్టాలని మండలంలో అధిక శాతం రైతులు కోరుతున్నారు.

పత్తి కొనుగోలు కోసం పడిగాపులు 

మండలంలో రెండు సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. 1.శ్రీ లక్ష్మీనరసింహ ఆగ్రో కాటన్ మిల్లు(ఎరగండ్లపల్లి ),2.హరిహర కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్(సరంపేట).గత నెల 24న  శ్రీ లక్ష్మీనరసింహ కాటన్ మిల్లు ప్రారంభించారు.సరంపేట లో ఉన్న హరిహర కాటన్ మిల్లు ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ప్రారంభించిన మిల్లులనేమో నేటికీ కొనుగోలు అరకోరగా జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తేమ శాతం ఎక్కువ ఉందన్న నేపంతో కొనుగోలు చేయటం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు. మంగళవారం  పత్తి కొనుగోలు చేపట్టాలని రైతులు రోడ్డుపై రాస్తారోకో కూడా నిర్వహించడం జరిగింది. రోజుల తరబడి ట్రాక్టర్లలో పత్తిని తీసుకువచ్చి కొనుగోలు కోసం వర్షంలో సైతం వేచి చూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎకరానికి 50 వేల పైనే 

మండలంలో అధిక శాతం రైతులు పత్తిని సాగు చేస్తారు.ఒక్కొ ఎకరానికి పెట్టుబడి 50 వేలపై ని ఖర్చవుతుంది. ఇక కూలీల ఖర్చులు పోను రైతుకు మిగిలేది పావువంతు. ఇక కౌలు రైతుల పరిస్థితి చెప్పనక్కర్లేదు అటు కౌలు కట్టలేక ఇటు పంటకు పెట్టుబడి పెట్టలేక కౌలు రైతులు రోజురోజుకు అప్పుల్లో కూరుకు పోతున్నారు. దానికి తోడు వర్షాల కారణంగా దిగుబడి శాతం కూడా తగ్గడంతో రైతులు ఆర్థిక  ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు.

జోరుగా దళారుల దందా 

సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు పత్తి కొనుగోలులో జాప్యం చేస్తుండడంతో దళారుల దందా జోరుగా సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. తడిసిన పత్తిని స్టోర్ చేసుకోవడానికి కొంతమంది రైతులకు స్థలం లేకపోవడంతో తెచ్చిన పంటను అమ్మటానికి దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇక తెరిచిన ఒక్క సీసీఐ పత్తి మిల్లు కూడా తేమ సాకుతో కొనుగోలు చేయకపోవడంతో దళారుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది‌. ప్రభుత్వం నిర్ణయించిన 8100 మద్దతు ధర కంటే తక్కువగా క్వింటాకు 5 నుండి 6వేల లోపు కొనుగోలు చేస్తూ,అమాయకమైన రైతులను మోసం చేస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.

పత్తి కొనుగోలు కొనుగోలు చేపట్టాలి 

•ఏర్పుల యాదయ్య సిపిఐఎం మండల కార్యదర్శి

సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు పత్తి కొనుగోలు చేపట్టాలి.వర్షాల కారణంగా తేమశాతం అధికంగా ఉంటుంది. తేమను పరిగణలోకి తీసుకోకుండా పత్తి కొనుగోలు చేపట్టాలి‌. అదే విధంగా నూతనంగా తెచ్చిన కపాస్ కిసాన్ యాప్ తో రైతులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రభుత్వం యాప్ ను వెంటనే తొలగించి గతంలో మాదిరిగా కొనుగోలు చేయాలి. 

ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలి 

•జిల్లా కిషోర్ రైతు (దామెర భీమనపల్లి)

పత్తి సాగుకు ఎకరానికి 50వేల పైనే ఖర్చు అవుతుంది.తెగుళ్లకు తోడు అకాల వర్షాల కారణంగా ఈసారి దిగుబడి శాతం కూడా తగ్గింది.ప్రభుత్వం పత్తి సాగులో నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -