-ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా జట్టును అభినందించిన ప్రధాని మోడీ
నవతెలంగాణ ఢిల్లీ: ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు, ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా టీమిండియాను ప్రధాని అభినందించారు. టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరును ఆయన మెచ్చుకున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఇతర ప్లేయర్లతో మోడీ మాట్లాడారు. ఫైనల్ బంతిని హర్మన్ జేబులో వేసుకోవడం గురించి ఆయన చర్చించారు. అదృష్టవశాత్తు బంతి తన దగ్గరకు వచ్చిందని, దాన్ని తన దగ్గరే పెట్టుకున్నానని హర్మన్ చెప్పింది. హర్లీన్ డియోల్ 2021లో ఇంగ్లాండ్‌పై అందుకున్న అద్భుత క్యాచ్‌ను కూడా ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఫిట్ ఇండియా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రధాని క్రికెటర్లను కోరారు. ఊబకాయ సమస్య పెరిగిపోతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలకు వెళ్లి క్రీడలను ఎంచుకునేలా యువతకు ప్రోత్సాహాన్నివ్వాలని ప్రధాని సూచించారు. జట్టు సభ్యులంతా సంతకాలు చేసిన జెర్సీని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ప్రధానికి బహూకరించింది.



