నవతెలంగాణ హైదరాబాద్: పాతకక్షల నేపథ్యంలో స్నేహితుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ వ్యక్తి మరో వ్యక్తిని పొడుస్తుండటం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాలానగర్ ఏసీపీ నగేష్‌రెడ్డి వివరాల ప్రకారం.. రంగారెడ్డినగర్ నివాసి రోషన్‌సింగ్(25) రౌడీషీటర్. జగద్గిరిగుట్ట పరిధి సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి(23) కూడా పాత నేరస్థుడే. రోషన్‌సింగ్ ఆరుగురు మిత్రులతో కలిసి 15 రోజుల క్రితం ఓ ట్రాన్స్‌జెండర్‌ను మాట్లాడుకుని రంగారెడ్డి నగర్‌లోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. డబ్బు చెల్లింపు విషయంలో గొడవ చోటుచేసుకుంది.
బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ట్రాన్స్‌జెండర్ ఫిర్యాదుతో రోషన్, అతని మిత్రులపై కేసు నమోదైంది. తమపై కేసు పెట్టాలని ట్రాన్స్‌జెండర్‌ను బాలశౌరెడ్డి పురమాయించి ఉంటాడని రోషన్ అనుమానం పెంచుకున్నాడు. అతన్ని ఎలాగైనా చంపుతానని స్నేహితులతో అనేవాడు. అది కాస్తా బాలశౌరెడ్డి చెవిన పడింది. ‘రోషన్ నన్ను చంపడమేంటి.. నేనే వాడిని చంపేస్తాన’ని మిత్రులతో బాలశౌరెడ్డి అనేవాడు.
బుధవారం సాయంత్రం రోషన్‌సింగ్, బాలశౌరెడ్డి, స్నేహితులు ఆదిల్, మహ్మద్ కలిసి మద్యం తాగి జగద్గిరిగుట్ట చివరి బస్టాపు వద్దకు చేరుకున్నారు. పాత విషయాలు మాట్లాడుకుంటూ గొడవ పెట్టుకున్నారు. ఉన్నట్లుండి రోషన్‌ను మహ్మద్ పట్టుకోగా బాలశౌరెడ్డి కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. అనంతరం బైకుపై సిద్ధంగా ఉన్న ఆదిల్‌తో కలిసి బాలశౌరెడ్డి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన రోషన్ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనాస్థలిలో ఉన్న మరో మిత్రుడు మనును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



