నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్‌లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖలు కూడా తమతమ పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేస్తున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు , బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన భార్య రబ్రీదేవి, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, కేంద్రమంత్రులు, రాజీవ్ రంజన్ సింగ్, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఓటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో అంటే ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ (గురువారం) పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 11న మిగితా 122 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. ఈ నెల 14న ఫలితాలను వెల్లడించనున్నారు.



