నవతెలంగాణ-హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనవల్లే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు.ఆ ఘర్షణలో కూల్చేసిన ఫైటర్ జెట్ల సంఖ్య ఏడు కాదని, ఎనిమిది అని కొత్త లెక్క చెప్పారు. బుధవారం మయామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మే నెలలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ఆయన పదేపదే చెబుతున్నారు. నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ట్రంప్ ఈ విషయాన్ని సుమారు 60 సార్లు ప్రస్తావించగా, ప్రతిసారీ భారత్ ఆయన వాదనను తోసిపుచ్చుతూ వస్తోంది.
అయితే, జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పౌరులను చంపినందుకు ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. దీంతో మే 7న పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. పాకిస్థాన్ కమాండర్లే కాల్పుల విరమణ కోసం భారత అధికారులను వేడుకున్నారని తెలిపింది. మే 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని వెల్లడించింది.



