నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ తొలి విడత పోలింగ్ సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు వరకు సాగిన ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 60.13శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు..మొదటి దఫా ఎన్నికల్లో భాగంగా 121 నియోజకవర్గాలకు విజయవంతంగా పోలింగ్ ముగిసింది. రెండో దఫాలో మిగిలిన అసెంబ్లీ స్థానాలకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడించనున్నారు. బీహార్ లోని బెగుసరాయి నియోజవర్గంలో అధికం 67.32 శాతం పోలింగ్ శాతం నమోదైంది. గోపాల్ గంజ్ 64.96, ముజఫర్‌పూర్ 64.63 శాతం పోలింగ్ నమోదు అయింది.
ఉదయం నుంచే ఓటర్‌లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా పలువురు ప్రముఖలు కూడా తమతమ పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు , బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన భార్య రబ్రీదేవి, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, కేంద్రమంత్రులు, రాజీవ్ రంజన్ సింగ్, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.



