Wednesday, April 30, 2025
Homeరాష్ట్రీయంకట్టంగూర్‌ మండల సమగ్రాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయాలి

కట్టంగూర్‌ మండల సమగ్రాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయాలి

– ప్రజా పోరుబాటలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-కట్టంగూర్‌

కట్టంగూరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండల సమగ్ర అభివృద్ధి కోసం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరుబాట సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా కట్టంగూరు మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నా, జిల్లా కేంద్రానికి.. రాష్ట్ర రాజధానికి దగ్గరల్లో ఉన్నా పాలకుల నిర్లక్ష్యం వల్ల మండలం అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలిపారు. మండలంలో రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఐటిపాముల్లో లిఫ్ట్‌ ఏర్పాటుచేసి సాగునీరు అందిస్తామని అధికారంలో ప్రభుత్వాలు హామీలిస్తూ శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప పనులు వేగవంతం చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి లిఫ్ట్‌ను పూర్తి చేసి చెరువులను, కుంటలను నింపి రైతులను ఆదుకోవాలని కోరారు. ఆసిఫ్‌నహర్‌ కాలువ పూడికలు తీసి మండలంలోని చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించాలని తెలిపారు. ఈ జిల్లాకు రోడ్డు రవాణా శాఖ మంత్రి ఉన్నా మండలంలోని లింకు రోడ్లు, బీటీ రోడ్లు మాత్రం అధ్వానంగా తయారయ్యారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రయివేటీకరణ చేస్తుంది తప్ప పేదల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పదేండ్లు పరిపాలించిన కేసీఆర్‌ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పి 16 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిగా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) ఎప్పుడూ ముందుండి పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, పాదయాత్ర సభ్యులు చిలుముల రామస్వామి, మురారి మోహన్‌, జాల రమేష్‌, గడగోజు రవీంద్రాచారి, గర్ధ సతీష్‌, జాల ఆంజనేయులు, చిలుకూరు సైదులు, ఊట్కూరు సుజాత శ్రీను, చెరుకు లక్ష్మయ్య, ముసుకు రవీందర్‌, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్‌, మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img