నవతెలంగాణ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల 26 వరకు పుష్కరాలు జరగనున్నాయి. బుధవారం రాత్రి 10.35 గంటలకే బృహస్పతి (గురువు) మిథున రాశిలోకి ప్రవేశించి పుష్కరకాలం ప్రారంభమవుతున్నా… గురువారం సూర్యోదయం నుంచి పుష్కర స్నానాలు ఆచరించాలని కాళేశ్వరం ఆలయ అర్చకులు వివరించారు. గురువారం వేకువజామున 5.44 గంటలకు సరస్వతి ఘాట్ వద్ద శ్రీగురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. పుష్కరాల సందర్భంగా చేసిన గణపతి పూజలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు పాల్గొన్నారు.

సాయంత్రం సీఎం రాక
గురువారం సాయంత్రం 4.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకోనున్నారు. పుష్కర సాన్నం ఆచరించి, శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతి సరస్వతి నవరత్న మాల హారతిలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతిదేవి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. కాళేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరాల్లో పాల్గొంటున్న తొలి సీఎం రేవంత్‌రెడ్డే కావడం విశేషం. గతంలో ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి పుష్కరాలు నిర్వహించినా ఉమ్మడి, తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రీ పాల్గొనలేదు.
పుష్కరాలకు రూ.35 కోట్లు
పుష్కరాల కోసం రూ.35 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పుష్కరఘాట్లు, తాగునీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుధ్యానికి దేవాదాయశాఖ ప్రాధాన్యం ఇచ్చింది. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు, పందిళ్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం శోభ సంతరించుకుంది.