నవతెలంగాణ-హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలు ‘ఓటు దొంగతనం’ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. వారంతా ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లోనూ, ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లనూ ఓటు వేశారని ఆరోపించింది. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఓటర్ల జాబితాలలో నకిలీని నిరోధించేందుకు ఉద్దేశించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) డ్రైవ్ ఉన్నప్పటికీ ఇలా జరిగిందని ‘ఆప్’ పేర్కొంది. ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా, ఢిల్లీ బీజేపీ పూర్వాంచల్ మోర్చా అధ్యక్షుడు సంతోష్ ఓఝా, పార్టీ కార్యకర్త నాగేంద్ర కుమార్.. ఈ ముగ్గురూ ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాల్లో ఓటు వేశారని ఆరోపించారు.
‘రివిజన్’ తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో కొత్తగా ఏ ఓటరూ నమోదు కాలేదని ఎన్నికల సంఘం తెలిపిందని, అయితే ఈ నేతలు బీహార్‌లో ఓటు ఎలా వేయగలిగారు? దీనిని చూస్తుంటే, దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనం ఏ స్థాయిలో జరుగుతున్నదో ఊహించుకోవచ్చని భరద్వాజ్ అన్నారు. దీనిపై ఢిల్లీ బీజేపీ యూనిట్ వ్యాఖ్యానించకపోయినా, బీజేపీ రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా వివరణ ఇచ్చుకున్నారు. తన ఓటును ఢిల్లీ నుండి తన స్వగ్రామమైన బీహార్‌లోని మన్సీర్‌పూర్ (బెగుసరాయ్)కి మార్చినట్లు ఆయన తెలిపారు. కాగా ‘ఆప్’ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఇంతవరకూ స్పందించలేదు.



