Tuesday, April 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్కార్మికులకు కష్టాలు..కార్పొరేట్లకు లాభాలు

కార్మికులకు కష్టాలు..కార్పొరేట్లకు లాభాలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కార్మికులకు కష్టాలు పెంచి, కార్పొరేట్లకు లాభాలు దోచిపెట్టే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ విమర్శించారు. సీఐటీయూ మేడ్చల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయసాధన యాత్రలో భాగంగా ఆదివారం మేడ్చెల్‌ జిల్లాలోని ఈసీఐఎల్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి హైదరాబాద్‌లోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో కార్మికులు స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 15 కిలోమీటర్ల మేర సాగిన బైక్‌ ర్యాలీని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. మోటారు సైకిళ్లకు ఎర్రజెండాలు కట్టి, మనువాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయాలపై ప్రజల్లో చర్చను రేకెత్తించేలా సాగింది. ప్రపంచ కార్మికుల ఐక్యత వర్థిల్లాలంటూ ర్యాలీలో పాల్గొన్న కార్మికులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘దోపిడికి, పీడనకు వ్యతిరేకంగా పోరాడుదామంటూ గళమెత్తారు. సామాజిక వివక్షను పారదోలేంత వరకు ఉద్యమాలు తప్పవంటూ నినాదాలు చేశారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామంటూ ప్రతినబూనారు. మనువాదాన్ని మట్టుపెట్టడమే లక్ష్యమంటూ నినదించారు. ఫూలే, అంబేద్కర్‌, బీటీ రణదివే, విమలారణదివే లక్ష్యాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. అనంతరం ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ శ్రమదోపిడి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా సీఐటీయూ పోరాడుతోందని చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ దేశ సామాజిక చరిత్రలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన మహానాయకుడని గుర్తు చేశారు. సమానత్వానికి ప్రతీకగా అంబేడ్కర్‌ను పరిగణించాలన్నారు. ఆయన్ని తక్కువ చేసి చూసిన సమాజానికే సమానత్వాన్ని భోదించిన విలక్షణ వ్యక్తి అని కొనియాడారు. వర్గ స్వభావంతో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చేలాయించడం, శ్రమను, సంపదను, అన్యాయంగా దొపిడీ చేస్తున్న వారికి వ్యతిరేకంగా, ప్రజల హక్కులను కాలరాసే విధానాలపై ఆయన జీవితాంతం పోరాటం చేశారని గుర్తు చేశారు. అందరికి విద్య, ఐక్య పోరాటమనే సందేశం లక్షలాది మందికి చైతన్యానిచ్చిందని చెప్పారు.
రాజ్యాంగ రచనలో అంబేద్కర్‌ అందించిన మౌలిక హక్కులు, ప్రత్యేకంగా సామాజిక, ఆర్ధిక, రాజకీయ సమానత్వాన్ని ప్రతిఫలించేలా ఉండటమనేది ఆయన దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. కుల వ్యవస్థకు అతీతంగా అన్ని వర్గాల వారికి సమాన హక్కులు, అవకాశాలు, గౌరవం ఉండాలనీ, చట్టం ముందు అందరూ సమానమనే ఆయన ఆలోచన మనందరికీ స్ఫూర్తిదాయకమని వివరించారు. అంబేద్కర్‌ కంటే ముందు ఫూలే, ఆ తర్వాత కార్మికోద్యమ నాయకుడు బీటీ రణదివే, విమలా రణదివేల వర్గపోరాట మార్గం దేశంలోని కార్మిక వర్గ విముక్తికి దిశానిర్దేశం చేసిందని తెలిపారు. సీఐటీయూ అదే మార్గంలో పోరాడుతోందని చెప్పారు.
కేంద్రంలోని మోడీ సర్కార్‌ మనువాద విధానాలతో కార్మిక వర్గాన్ని అనైక్యతకు గురిచేస్తున్నదని విమర్శించారు. కేవలం కార్పొరేట్ల లాభాలే తప్ప, కార్మిక సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆక్షేపించారు. శ్రామిక వర్గం ఐక్యం కాకుండా కుల అసమానతలు పెంచి పోషిస్తూ అనైక్యతకు గురిచేస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, దౌర్జాన్యాలు పెరుగుతున్నాయనీ, వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్‌, జె. చంద్రశేఖర్‌, కూరపాటి రమేష్‌, అశోక్‌, శ్రీనివాస్‌, రాజశేఖర్‌, ఉన్నికృష్ణన్‌, రమేష్‌, వెంకన్న, గణేష్‌, రాజశేఖర్‌, జి శ్రీనివాస్‌, లింగస్వామితో పాటు వివిధ పరిశ్రమల నాయకులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయ యాత్ర-బైక్‌ ర్యాలీ
నవతెలంగాణ-సిటీబ్యూరో

సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహించిన ”సామాజిక న్యాయ యాత్ర బైక్‌ ర్యాలీ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్‌ చౌరస్తా అంబేద్కర్‌ విగ్రహం నుంచి ప్రారంభమై ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ముగిసింది. ముందుగా ఈసీఐఎల్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ పూలమాల వేశారు. అనంతరం ఈసీఐఎల్‌ చౌరస్తా వద్ద పాలడుగు భాస్కర్‌ జెండా ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఈసీఐఎల్‌ చౌరస్తా నుంచి మౌలాలి, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్‌ మీదుగా స్టీల్‌ బ్రిడ్జి ద్వారా లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు సాగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img