– దుమ్ముగూడెంలో భారీ ప్రదర్శన
– ముందస్తు అక్రమ అరెస్టులతో కార్మిక ఉద్యమాలు ఆపలేరు
– యలమంచి రవికుమార్, కారం పుల్లయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గో బ్యాక్ అంటూ అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు నినాదాలు చేస్తూ శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. వందలాదిమంది కార్మికులతో లక్ష్మీ నగరం నుండి ప్రారంభమైన ప్రదర్శన పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించి బైఠాయించారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని నినదించారు. ధర్నాను ఉద్దేశించి ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు యలమంచి రవికుమార్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ… అక్రమ అరెస్టులతో కార్మిక ఉద్యమాలు ఆపలేరని అరెస్టు చేసిన ప్రజా ఉద్యమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ భద్రాచలం పర్యటన సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి పద్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంబీ నర్సారెడ్డి లను తెల్లవారుజామున భద్రాచలంలో అరెస్టు చేసి దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ కి తరలించారని అన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కార్మిక, ప్రజా సమస్యలు పరిష్కరించాకనే భద్రాచలం రావాలని అన్నారు. కార్మిక నాయకులను పోలీసులు ఇంట్లోకి వెళ్లి అక్రమంగా అరెస్టులు చేయటం దుర్మార్గమైన చర్యని అన్నారు. భద్రాచరానికి ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మంత్రులను నియోజకవర్గంలో ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు యలమంచి శ్రీను బాబు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల మధు, సరియం ప్రసాద్, ఎలమంచిలి వంశీ, అంగన్వాడి యూనియన్ మండల కార్యదర్శి కమలదేవి, గజ్జలక్ష్మి, కృష్ణవేణి, విజయ, పోడుతూరి శిరోమణి, కారం కనకమ్మ, గోంది చిన్నక్క, ఎం నర్సు, పి అన్నపూర్ణ, భాగ్యవతి, తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు అరెస్టులు ప్రభుత్వం పిరికిపంద చర్య
మంత్రి కేటీఆర్ భద్రాచలం పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను, ఆదివాసి సంఘాల నాయకులను, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం ప్రభుత్వం పిరికిపంద చర్య అని మాజీ డిసిసిబి చైర్మన్ ఎలమంచి రవికుమార్ అన్నారు. శనివారం ఆయన దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులు అరెస్టు చేసిన నాయకులను పరామర్శించారు. ఇటువంటి చర్య ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మచ్చ లాంటిది అన్నారు.
భయంతోనే ముందస్తు అరెస్టులు
సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆదివాసీ సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టులు చేశారని టిడిపి మండల అధ్యక్షులు కొమరం దామోదర్ రావు అన్నారు. ఇప్పటికైనా బేషరత్తుగా విడుదల చేయించి, వాళ్ళతోచర్చలు జరపాలని తెలుగుదేశం పార్టీగా తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.
టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిలాల్ అరెస్టు దుర్మార్గమైన చర్య
కేటీఆర్ పర్యటన నేపథ్యంలో టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి హరిలాల్ నాయక్ ను అరెస్ట్ చేయడం ఆ ప్రజాస్వామికమైన చర్య అని టిపీటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి బి. రవి అన్నారు. ఉపాధ్యాయ సంఘాల రాజకీయాలతో సంబంధం లేదు అన్నారు.
అశ్వారావుపేట: కేటిఆర్ పర్యటన నేపథ్యంలో సీపీఐ(ఎంఎల్) ప్రజా పంథా జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కెచ్చెల రంగారెడ్డి, పి.ఒ.డబ్ల్యు జిల్లా కార్యదర్శి కెచ్చల కల్పన తదితరుల అక్రమ అరెస్టులను ప్రజాస్వామికవాదులు ఖండించాలని ఆ పార్టీ నాయకులు గోకినపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.