– ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైనం
– ఇష్టా రీతిన వ్యవహరిస్తున్న ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు
– నిద్రమత్తులో జిల్లా విద్యాశాఖ యంత్రాంగం
నవతెలంగాణ-సంగారెడ్డి : జిల్లా కేంద్రం, ఉన్నతాధికారులు ఉండే ప్రాంతం అయినా సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ తమ ఇష్టా నుసారంగా పలు ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలల నిర్వహణ చేస్తున్న జిల్లా విద్యాశాఖ యంత్రాంగం నిద్రమత్తులో ఉన్నట్లుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండో శనివారం అధికారికంగా ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలో యదేచ్చగా రెండో శనివారం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. అందులో సంగారెడ్డి పట్టణంలోని సాహితి, పయనీర్, కృష్ణవేణి, శ్లోక శ్రీవాణి, శ్రీ చైతన్య, కాకతీయ, ఆద్య, విరుచు, శ్రీ వైష్ణవి, బచ్పన్ తదితర పాఠశాలలో రెండో శనివారం యదేచ్చగా పాఠశాల నిర్వహణ చేస్తున్నారు.
డీ ఈ ఓ , ఎంఈఓ, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఈ విధంగా ఉంటే మిగతా ప్రాంతాలలో ఎలా ఉంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెండో శనివారం సెలవు అనేది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మానసిక, శారీరక అలసట తగ్గించేందుకు, అలాగే తల్లిదండ్రులు, స్నేహితులతో సమయం గడపడం, వ్యక్తిగత పనులు చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. కాగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రెండో శనివారం పాఠశాలలు నడిపిస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టి పట్టనట్లుగా ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కావున జిల్లా కలెక్టర్ విద్యాశాఖ పైన ప్రత్యేక దృష్టి పెట్టి నిబంధనలు పాటించని ప్రయివేట్ పాఠశాలల పైన, అంతేకాకుండా విద్యాశాఖ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.



