నవతెలంగాణ-హైదరాబాద్: జపాన్ ఉత్తర ప్రాంతాలను ఆదివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం … ఆ తరువాత కూడా మరికొన్ని ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో సునామీ హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం … 6.7 తీవ్రతతో ఉన్న ఈ భూకంపం జపాన్ ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి సమీపంగా, సముద్ర మట్టం నుండి సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టంపై నివేదికలు లేవు. అలాగే, ఆ ప్రాంతంలోని రెండు అణు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి అసాధారణతలు గమనించలేదని అధికారులు తెలిపారు. వాతావరణ సంస్థ ఉత్తర తీరప్రాంతాలకు గరిష్టంగా ఒక మీటరు ఎత్తు వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
భూకంపం వచ్చిన గంట తర్వాత కూడా సునామీ హెచ్చరిక కొనసాగింది. ప్రజలను తీరప్రాంతాల నుండి దూరంగా ఉండాలని ప్రభుత్వ ప్రసార సంస్థ ఎన్‌హెచ్‌కే సూచించింది. సునామీ ప్రమాదం ఇంకా కొనసాగుతోందని, తీర ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు రావచ్చని హెచ్చరించింది. ఇవాటే ప్రిఫెక్చర్‌లోని ఓఫునాటో నగరంలో, ఓమినాటో పోర్ట్ వద్ద సుమారు 10 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు నమోదయ్యాయని ఎన్‌హెచ్‌కే తెలిపింది. ఆ ప్రాంతంలో బుల్లెట్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని సంస్థ పేర్కొంది.
భూకంపాల కారణంగా కొంత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడిందని క్యోడో న్యూస్ తెలిపింది. జపాన్ పసిఫిక్ ”రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉంది. ఇది ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతాలలో ఒకటి. ఇదే ప్రాంతంలో 2011 మార్చిలో భూకంపం సంభవించింది, సునామీ రావడంతో ఘోర ప్రాణనష్టానికి దారితీసింది.



