నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 9 మంది మృతిచెందారు. అయితే ఆత్మాహుతి దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సూసైడ్ బాంబర్‌కు చెందిన ఫోటోను రిలీజ్ చేశారు. డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఆ దాడికి పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. తెలుపు రంగు హుందైయ్ ఐ20 కారులో ఉమర్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ సూసైడ్ బాంబర్‌కు చెందిన ఫోటో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నది.
జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌ను పోలీసులు బయటపెట్టిన విషయం తెలిసిందే. డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌తో డాక్టర్ ఉమర్‌కు లింకు ఉన్నట్లు తేల్చారు. అదీల్, షకీల్‌ను అరెస్టు చేశారు. ఆ ఇద్దర్నీ అరెస్టు చేసినట్లు తెలుసుకున్న డాక్టర్ ఉమర్.. ఫరీదాబాద్ నుంచి తప్పించుకున్నాడు.
అయితే ఆందోళనకు గురైన అతను బహుశా తన వాహనాన్ని తానే పేల్చుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఉమర్ .. పేలుడు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కారులో డెటోనేటర్‌ను పెట్టినట్లు అనుమానిస్తున్నారు.



