నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వాళ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యంగా మార్చేశారని బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులకు మాగంటి సునీత విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆకు రౌడీలు అందరినీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పిలిపించారని మండిపడ్డారు. నా భర్త ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశారని, కానీ ఇంతటి దౌర్జన్యాన్ని తాను ఎన్నడూ చూడలేదని అన్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందని సునీత ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర బీఆర్‌ఎస్ ఏజెంట్లను కూర్చోనివ్వడం లేదని విమర్శించారు. పోలీసులు బీఆర్ఎస్ ఏజెంట్ల దగ్గర నుంచి టేబుల్స్, చైర్‌లు లాక్కుని దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఓటర్లందరూ బయటికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మాగంటి సునీత కోరారు. పోలింగ్‌కు ఇంకా నాలుగు గంటల సమయం ఉందని, దయచేసి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 13వ తేదీ వరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండని, 14న తాను గెలిచాక అందరి సంగతి చెప్తానని ఆమె హెచ్చరించారు.



