Wednesday, November 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపార‌ద‌ర్శ‌కంగా ఎన్నికలు నిర్వ‌హిస్తే బంగ్లాకు వెళ్తా: షేక్‌ హసీనా

పార‌ద‌ర్శ‌కంగా ఎన్నికలు నిర్వ‌హిస్తే బంగ్లాకు వెళ్తా: షేక్‌ హసీనా

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బంగ్లాదేశ్‌లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తిరిగి తన స్వదేశానికి వెళ్లే విషయంలో అక్కడి ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టారు. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తానని ఆమె స్పష్టం చేశారు. అలాగే బంగ్లాలో అవామీ లీగ్‌ పార్టీ పై నిషేధం ఎత్తివేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఆమె తాజాగా పీటీఐకీ ఇచ్చిన ఈమెయిల్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం బంగ్లాలో అధికారంలో ఉన్న యూనస్‌ నేతత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు అధికారం ఇస్తూ.. భారత్‌తో ఆ దేశ సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని ఆమె ఆరోపించారు.

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భారత్‌తో బలమైన సంబంధాలు కొనసాగించామని, యూనస్‌ తన మూర్ఖత్వంతో వాటిని బలహీనపరుస్తున్నారన్నారని హసీనా విమర్శించారు. కష్ట సమయంలో ఆశ్రయం కల్పించినందుకు మోడీ ప్రభుత్వానికి, భారత ప్రజలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తాను అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం విఫలమైందని, అలాంటి భయంకరమైన ఘటనల నుంచి పాఠాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు.

ఆ సమయంలో విద్యార్థి నాయకులు కూడా బాధ్యత తీసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తనపై నమోదైన కేసుల విషయంలో అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో విచారణకు హాజరవడానికి తాను సిద్ధంగా ఉన్నానని షేక్‌ హసీనా తెలిపారు. యూనస్‌ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. అవన్నీ రాజకీయంగా తనను బలహీనపరచడానికి చేసిన కుట్రగా పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్‌ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -