నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం పెరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్‌లో విజయం అందించిన ప్రజలకు ఈ సందర్బంగా సీఎం ధన్యవాదాలు తెలిపారు. నవీన్ యాదవ్ విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.
ఈ తీర్పుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ద్వారా బకాయిలుపడిన నిధులు వచ్చే విధంగా తమకు సహకారం అందించాలని కోరారు. ఎంపీలుగా బీజేపీ నాయకులను గెలిపించిన ప్రయోజనం లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు అయిందని తెలియజేశారు. ఇకనైనా బీజేపీ బుద్ధిమార్చుకొని రాష్ట్ర అభివృద్ధికి తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా హరీష్ రావు అసహన్ని, కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అధికారం ఏ కుటుంబానికి శాశ్వతం కాదన్నారు. ప్రజలు కేటీఆర్ కుటుంబాన్ని గమనిస్తున్నారని, జనరల్ ఎన్నికలకు టైం ఉందని, అప్పటి వరకు ఓపికతో ఉండాలని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేసారని, ఫేక్ న్యూస్‌తో బీఆర్ఎస్ కుట్రలు చేసిందని మండిపడ్డారు.



