నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును పంత్ అధిగమించాడు. దక్షిణాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో లాంగ్-ఆన్ మీదుగా భారీ సిక్సర్ బాదిన పంత్, ఈ ఫార్మాట్‌లో 92వ సిక్సర్‌ను నమోదు చేశాడు. దీంతో 91 సిక్సర్లతో ఉన్న సెహ్వాగ్ రికార్డు బద్దలైంది. ఇదే మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయంతో మైదానాన్ని వీడాడు. కేవలం మూడు బంతులు ఆడిన తర్వాత మెడ నొప్పితో ఇబ్బంది పడటంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
రెండో రోజు భోజన విరామానికి భారత్ 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (11), ధ్రువ్ జురెల్ (05) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ (39) అర్ధశతకానికి 11 పరుగుల దూరంలో ఔట్ కాగా, మూడో స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అలాగే రిషభ్ పంత్ 27 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలిరోజు భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది.



