ధాన్యంపై అద్దెకు తీసుకొచ్చి కప్పిన టార్పాలిన్
ఐదేళ్లుగా నిలిచిన సరఫరా
నవతెలంగాణ – మల్హర్ రావు
సబ్సిడీపై టార్పాలిన్లు పంపిణీ చేయడాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసింది. రైతులకు సబ్సిడీపై అందిస్తున్న టార్పాలిన్ల సరఫరాకు ఐదేళ్లుగా బ్రేక్ పడింది. ఇటీవల కురిసిన ఆకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలు తడిసి ముద్ద య్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్ల పంపిణీ పునఃరుద్దరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలతో వరిపంట పూర్తిగా తడిసిపోయాయి. పంట ఉత్పత్తులు దెబ్బతినడంతో కాపాడుకోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. రైతులు పంటలను తడవకుండా ఉంచేందుకు నానా అవస్థ పడుతున్నారు. పంటలను ఆరబెట్టేం దుకు రైతన్నలకు టార్పాలిన్లు అవసరం.
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ప్రభుత్వం 50% రాయితీపై గతంలో టార్పాలిన్లు పంపిణీ చేసింది. ప్రస్తుతం వరి కోతలు మొదలవ్వడంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తేమ ఎక్కువగా ఉండటంతో రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరలకు తాటిపత్రిలు, టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేస్తున్నారు.గ్రామాల్లో వివిధ ప్రాంతాల నుంచి కవర్లు తీసు కొచ్చి అద్దెకు ఇస్తుండేవారు.దీంతో రైతులకు ఆర్థికభారం ఎక్కువతుండటంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా టార్పాలిన్ కవర్లు అంద జేయాలని కోరుతున్నారు.
రైతులకు భారం..
గతంలో ఉద్యానశాఖ ద్వారా టార్పాలిన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటి ధర రూ.2,500 వరకు ఉండేది.ఇందులో 50శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వగా మిగతా 50% రూ.1250 రైతులు చెల్లించేవారు.తర్వాత పథకాన్ని వ్యవసాయశాఖకు పరిమితం చేశారు.రెండేళ్ల నుంచి పంపిణీ నిలిపివేసింది. ఒక్కో టార్పాలిన్ కు రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ఖర్చుచేయడం రైతులకు భారంగా మారుతోంది.
తేమ పేరుతో కొర్రీలు..
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు 17% లోపు తేమ ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. పూర్తిగా అరబెట్టుకున్నాకే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి సబ్సిడీ ఇస్తున్నప్పటికీ టార్పాలిన్ల పంపిణీపై చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



