నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల బీహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో లక్షల ఓట్లు తొలగించిన విషయం తెలిసిందే.ఈ వ్యవహరంపై ఇండియా కూటమి బహిరంగంగా అనేక ఆధారాలు బయటపెట్టింది. ప్రతిపక్షాల సందేహాలను నివృత్తి చేయకుండా..కేంద్ర ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తోందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియతో అనేక మంది ఓటు హక్కును కోల్పోతున్నారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు ఎస్ఐఆర్ పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి.
తాజాగా కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) SIRను వ్యతిరేకిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తలపెట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను సర్వేను వెంటనే నిలిపి వేయాలని ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓ వైపు లోకల్ బాడీ ఎన్నికలు, మరోవైపు SIR సర్వే కొనసాగించడం సమంజసం కాదని పేర్కొన్నారు.
డిసెంబర్ 9, 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫై చేసిందని, SIR తర్వాత ముసాయిదా జాబితా డిసెంబర్ 4న ప్రచురించబడుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రియాశీల ఎన్నికల ప్రక్రియకు సమాంతరంగా SIR నిర్వహించడం పోల్ ప్రక్రియ సమగ్రత,స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
బీహార్ తర్వాత దేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్‌ను నిర్వహించాలని సన్నాహాలు చేస్తుంది. దీంతో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రెండో దశ ఓటర్ల జాబితా SIRను నిర్వహిస్తామని ECI ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లను కవర్ చేస్తుంది. తుది ఓటర్ల జాబితా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రచురించనున్నారు.



