– శాంతి ప్రణాళికకు భద్రతా మండలి ఆమోదం
– తిరస్కరించిన హమాస్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికను సమర్ధిస్తూ, గాజాలో అంతర్జాతీయ స్థిరీకరణ బలగాల ఏర్పాటుకు అధికారమిస్తూ ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. దీన్ని ‘నిజమైన చారిత్రక క్షణం’ గా ట్రంప్ వ్యాఖ్యానించారు.
సోమవారం సాయంత్రం జరిగిన ఓటింగ్‌లో భద్రతా మండలి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. 15 మంది సభ్యులు గల మండలిలో 13 ఓట్లు అనుకూలంగా రాగా, చైనా, రష్యాలు గైర్హాజరయ్యాయి.
గాజాలో శాంతి స్థాపనకు ఒక యంత్రాంగం ‘బోర్డ్‌్ ఆఫ్ పీస్ (బీఓపీ)’ ఏర్పాటును కూడా ఈ తీర్మానం స్వాగతించింది. అంతర్జాతీయ చట్టబద్ధతతో కూడిన ఈ పరివర్తనా పాలనా యంత్రాంగం ప్రస్తుత శాంతి ప్రణాళిక కింద గాజా పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను సమన్వయం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. దీనిపై ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు ఇది దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ శాంతి బోర్డుకు ట్రంప్ నేతృత్వం వహిస్తారు. పలువురు ప్రపంచ నేతలు సభ్యులుగా వుంటారు.
ఈ తీర్మానానికి అన్ని పక్షాలు కట్టుబడి వుండాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ పేర్కొన్నారు. దౌత్యపరంగా సాగిన వ్యవహారమంతా ఇక క్షేత్ర స్థాయిలో కార్యాచరణగా మారాలని, అందుకు అత్యవసరంగా కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా వుందని పేర్కొన్నారు.
హమాస్ తిరస్కృతి
కాగా ఈ తీర్మానాన్ని హమాస్ తిరస్కరించింది. పాలస్తీనా హక్కులు, డిమాండ్లను నెరవేర్చడంలో ఈ తీర్మానం విపలమైందని వ్యాఖ్యానించింది. గాజాపై విదేశీ సంరక్షత్వాన్ని విధించే దిశగా ఇదొక ప్రమాదకరమైన చర్య అని విమర్శించింది. ఈ తీర్మానం కేవలం ఇజ్రాయిలీల ప్రయోజనాలను మాత్రమే నెరవేరుస్తుందని విమర్శించింది.
ఎవరేమన్నారు?
అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, పాలస్తీనా సార్వభౌమత్వాన్ని, స్వీయ నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ తీర్మానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని బ్రిటన్ సూచించింది. ‘తీర్మానంలో సమతుల్యం, సమగ్రత కోసం మేము అత్యవసర సవరణలు సూచించాం. వాటిలో కొన్నింటిని తీర్మానంలో చేర్చారు’ అని అల్గేరియా ప్రతినిధి అమర్ బెండ్జామా చెప్పారు. ఈ తీర్మానం పాలస్తీనా సార్వభౌమత్వానికి బీజం వేసిందని అరబ్ దేశాలు అభిప్రాయపడు తున్నాయని ఆయన తెలిపారు. తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని అల్జీరియా చివరికి నిర్ణయించుకుంది. తీర్మానంలో వాడిన పదాలపై ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ముందు నుంచే వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరికి ట్రంప్ ఒత్తిడితో ఆయన అయిష్టంగానే అంగీకారం తెలిపినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో మాట మార్చారు. ఏ భూభాగంలో అయినా పాలస్తీనా రాజ్య ఏర్పాటుకు తాము వ్యతిరేకమేనని, ఇందులో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. తీర్మానం ఆమోదం పొందడం చారిత్రకమని అమెరికా అభివర్ణించింది. ట్రంప్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తానని, తీర్మానం అమలుకు కృషి చేస్తానని పాలస్తీనా అథారిటీ హామీ ఇచ్చింది. భద్రతా మండలి తీర్మానాన్ని ఇజ్రాయిల్ ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. అయితే ఇది సరైన దిశగా తీసుకున్న ముఖ్యమైన చర్య అని మలేషియా వ్యాఖ్యానించింది.
పాలస్తీనీయులకు మద్దతుగా ర్యాలీ
గాజాలోని పాలస్తీనీయులకు మద్దతుగా న్యూయార్క్‌లోని అమెరికా కార్యాలయం వెలుపల నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. గాజా పాలనపై అమెరికా, ఇజ్రాయిల్ ప్రభుత్వాలకు విస్తృత అధికారాలను కట్టబెడుతున్న తీర్మానాన్ని వారు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. పాలస్తీనా పతాకాలను ధరించిన నిరసనకారులు అమెరికా కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదిలావుండగా రమల్లాకు చెందిన మానవ హక్కుల సంస్థ అల్-హక్ కూడా తీర్మానాన్ని వ్యతిరేకించింది. ఇది స్వయం పాలనకు పాలస్తీనియన్లకు ఉన్న హక్కును కాలరాస్తోందని ఆరోపించింది. శాంతి బోర్డు ఏర్పాటు, తాత్కాలిక అంతర్జాతీయ స్థిరీకరణ దళం మోహరింపు వంటి చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని పూర్తిగా ఉల్లం ఘిస్తున్నాయని మండిపడింది.
గాజాలో ఇక అంతర్జాతీయ బలగాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



