నవతెలంగాణ-హైదరాబాద్ : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత అక్రమాస్తుల కేసులో రేపు (గురువారం) హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో, కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
గత ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకాలేదని, ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన భౌతికంగా హాజరుకావడం తప్పనిసరి అని సీబీఐ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, నవంబర్ 21లోగా వ్యక్తిగతంగా హాజరుకావాలని జగన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో, గడువుకు ఒకరోజు ముందే ఆయన కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఇటీవల జగన్ కోర్టు అనుమతితో ఐరోపా పర్యటనకు వెళ్లారు. పర్యటన ముగిసిన వెంటనే వ్యక్తిగతంగా హాజరుకావాలని అప్పుడే కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఆయన హాజరుకాకుండా మినహాయింపు కోరారు. సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా, అక్రమాస్తుల కేసులో జగన్ 2013 సెప్టెంబరు నుంచి బెయిల్‌పై బయట ఉన్న విషయం తెలిసిందే.



