నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, పలు సంచలన కేసుల్లో నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగిస్తోంది. అన్మోల్‌తో పాటు పంజాబ్‌కు చెందిన పరారీలో ఉన్న ఇద్దరు నేరస్థులు, మరో 197 మంది అక్రమ వలసదారులతో కూడిన ప్రత్యేక విమానం అమెరికా నుంచి బయల్దేరింది. ఈ విమానం బుధవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కానుందని అధికారులు ధ్రువీకరించారు.
సంచలనం సృష్టించిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటనల్లో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2022 ఏప్రిల్‌లో నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్ నుంచి అన్మోల్ పరారైనట్లు నిఘా వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఉంటూనే ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా తన నేర సామ్రాజ్యాన్ని నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గత ఏడాది కాలిఫోర్నియాలో పట్టుబడిన అన్మోల్‌ను అక్కడి పోలీసులు కస్టడీలో ఉంచి, అతడి కదలికలను గుర్తించేందుకు కాలికి ఎలక్ట్రానిక్ మానిటర్ (యాంకిల్ మానిటర్) అమర్చారు. లూసియానా నుంచి అతడిని భారత్‌కు పంపుతున్నారు. అన్మోల్‌ను అమెరికా భూభాగం నుంచి పంపించివేసినట్లు తమకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిందని బాబా సిద్దిఖీ కుమారుడు, ఎన్సీపీ నేత జీషన్ సిద్దిఖీ ధ్రువీకరించారు. నిందితుడిని పట్టుకోవాలని తాము అమెరికా అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.
బుధవారం ఉదయం ఢిల్లీలో విమానం దిగిన తర్వాత అన్మోల్‌ను ఏ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంటుందనే దానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌లపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


