నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ సరిహద్దులో ఉన్న నేపాల్‌లోని బారా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు. పదవీచ్యుత ప్రధాని కె.పి.శర్మ ఓలి పార్టీ సిపిఎన్-యుఎంఎల్ కార్యకర్తలకు, జెన్‌జెడ్ యువత మధ్య ఘర్షణతో ఉద్త్రిక్త వాతావరణం నెలకొందని అన్నారు. సిమారా విమానాశ్రయం నుండి 500 మీటర్ల పరిధిలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని బారా జిల్లా పరిపాలన కార్యాలయం తెలిపింది.
సిపిఎన్-యుఎంఎల్ ప్రధాన కార్యదర్శి శంకర్ పోఖారెల్, పార్టీ యువ నేత మహేష్ బాస్నేట్ ప్రయాణిస్తున్న బుద్ధ ఎయిర్ విమానం ఖాట్మాండు నుండి సిమారాకు బయలు దేరాల్సి వుంది. సిమారాలో వారు ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీనుద్దేశించి ప్రసంగించాల్సి వుండగా జెన్ జెడ్ నిరసనకారులు అడ్డుకున్నారు. సిపిఎన్-యుఎంఎల్ నేతలు, జెన్ జెడ్ నిరసనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు విమానాశ్రయం చుట్టూ కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు.
కె.పి.శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలిన అనంతరం సెప్టెంబర్ 12న రద్దు చేయబడిన ప్రతినిధుల సభను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎన్-యుఎంఎల్ దేశవ్యాప్తంగా నిరసనకార్యక్రమాలను చేపడుతోంది. సెప్టెంబర్ 9న అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల సందర్భంగా నిరసనకారులను సామూహికంగా హత్య చేయడం, ఓలి పాలనకి చెందిన సోషల్‌మీడియా నిషేధంపై కూడా చర్యలు తీసుకోవాలని జెన్‌జెడ్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.



