నవతెలంగాణ-హైదరాబాద్: జర్నలిజం నేరం కాదని డిఐజిఐపియుబి న్యూస్ ఇండియా ఫౌండేషన్ శుక్రవారం పేర్కొంది. జమ్ము కాశ్మీర్ పోలీసుల రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఎ) కాశ్మీర్ టైమ్స్‌పై జరిపిన ”దాడులు, పెరుగుతున్న వేధింపులను ” డిఐజిఐపియుబి తీవ్రంగా ఖండించింది. . ”స్వతంత్ర, విశ్వసనీయ వార్తా సంస్థను ఈ విధంగా లక్ష్యంగా చేసుకోవడం పత్రికా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి” అని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.
కాశ్మీర్ టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్ అనురాధ భాసిన్ అభిప్రాయాన్ని డిఐజిఐపియుబి పునరుద్ఘాటించింది. ఇతర విషయాలతో పాటు, ఈ దాడి గురించిన సమాచారం మీడియా నివేదిక నుండి తమకు వచ్చిందని ప్రకటనలో పేర్కొంది. ఎస్‌ఐఎ దాడులు నిర్వహించిన కార్యాలయం గత నాలుగు సంవత్సరాలుగా మూసివేయబడిందని పేర్కొంది. ఉగ్రవాద రహిత కాశ్మీర్‌ను నిర్మించడానికి మార్గంగా శాంతి, చర్చలు మరియు రాజకీయ ప్రక్రియలను సమర్థించే స్వరాలను లక్ష్యంగా చేసుకోవడానికి, అణచివేయడానికి మరియు పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అనురాధ భాసిన్ ప్రకటనను డిఐజిఐపియుబి నొక్కి చెప్పింది.
స్వేచ్ఛాయుతమైన పత్రికా వ్యవస్థ ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటింది. కాశ్మీర్ టైమ్స్‌పై ఉన్న అన్ని బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలని , జర్నలిస్టులు భయం లేకుండా ప్రతీకార చర్యలు లేకుండా పనిచేయగలరని నిర్థారించుకోవాలని డిఐజిఐపియుబి డిమాండ్ చేసింది. కాశ్మీర్ టైమ్స్‌తో పాటు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వాస్తవ ఆధారిత, ప్రజా ప్రయోజన జర్నలిజంను కొనసాగించే జమ్ముకాశ్మీర్‌లోని జర్నలిస్టులందరికీ డిఐజిఐపియుబి సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించింది. జర్నలిజం నేరం కాదు, స్వతంత్ర గొంతుకలను అణచివేయడానికి చేసే ఏప్రయత్నమైనా ప్రజాస్వామ్య ప్రధాన విలువలకు హాని కలిగిస్తుందని ప్రకటనలో స్పష్టం చేసింది.
Committee to Protect Journalists (CPJ) : దాడులు ఆందోళనకరం
కాశ్మీర్ టైమ్స్ పై ఎస్‌ఐఎ దాడులపై ‘కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజె)’ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ”కాశ్మీర్‌టైమ్స్ కార్యాలయంపై జరిగిన దాడి నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దాడులు జమ్ముకాశ్మీర్‌లోని మీడియా సంస్థలపై పెరుగుతున్న ఒత్తిడి గురించి ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. అధికారులు ఈ దాడులపై చట్టపరమైన ఆధారాలను స్పష్టంగా వివరించాలి. దర్యాప్తు ఏదైనా పారదర్శకతతో, పూర్తి గౌరవంతో నిర్వహించబడుతుందని నిర్థారించుకోవాలి. వార్తాసంస్థలు తమ విధులను నిర్వహించినందుకు శిక్షార్హమైన చర్యలను ఎదుర్కోకూడదు” అని పేర్కొంది.
జమ్మూలోని కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై గురువారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) రైడ్స్ నిర్వహించింది. ఈసందర్భంగా SIA అధికారులు మాట్లాడుతూ.. దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడం, ఉగ్రవాద భావజాలాలకు మద్దతు ఇవ్వడం వంటి ఆరోపణలపై కాశ్మీర్ టైమ్స్ వార్తాపత్రిక జమ్మూ ప్రధాన కార్యాలయంపై రైడ్స్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ రైడ్స్‌లో AK-47 బుల్లెట్లు, ఒక పిస్టల్, గ్రెనేడ్ లివర్లతో సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది.
నిన్న ఉదయం 6 గంటలకు జమ్మూలోని కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై SIA అధికారులు రైడ్స్ ప్రారంభించారు. ఈ వార్తాపత్రిక మేనేజర్ సంజీవ్ కెర్నిని ఆయన ఇంటి నుంచి పిలిపించి కార్యాలయాన్ని తెరిచారు. పలు నివేదికల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం ఆ వార్తాపత్రికపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. దేశ వ్యతిరేక విషయాలను ప్రచురించారనే ఆరోపణలతో కాశ్మీర్ టైమ్స్ వార్తాపత్రిక, జమ్మూ కాశ్మీర్ కార్యాలయంపై గతంలో దాడి కూడా జరిగింది. ప్రస్తుతం ఈ పత్రిక గత కొన్ని నెలలుగా ప్రచురణను నిలిపివేసింది.
జర్నలిస్ట్ వేద్ భాసిన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కాశ్మీర్ టైమ్స్ కొంతకాలంగా జమ్మూ నుంచి దాని ప్రింట్ ఎడిషన్ ప్రచురణను నిలిపివేసింది. ఇప్పుడు ప్రధానంగా ఈ పత్రిక ఆన్‌లైన్‌లో పనిచేస్తోంది. భాసిన్ మరణం తరువాత, దీనిని ఆయన కుమార్తె అనురాధ భాసిన్, ఆమె భర్త ప్రబోధ్ జామ్వాల్ నిర్వహిస్తున్నారు. అయితే ఇద్దరూ అమెరికాకు వెళ్లి గత కొన్నేళ్లుగా అక్కడ నివసిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌కు ప్రబోధ్ ఎడిటర్‌గా, అనురాధ మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నట్లుగా సమాచారం.


