నవతెలంగాణ-హైదరాబాద్: పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)ను భారీ భూకంపం (Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో 5.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి ఢాకాలో ఇప్పటి వరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గోడ కూలి ముగ్గురు, బిల్డింగ్ రూఫ్ కూలి ముగ్గురు మరణించినట్లు తెలిపింది. ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్‌డిలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది.
మరోవైపు ఈ ప్రకంపనల ధాటికి భారత్‌లోనూ భూమి కంపించింది. కోల్‌కతా (Kolkata) సహా ఉత్తర భారతంలో (Northeast India) ప్రకంపనలు నమోదయ్యాయి. కోల్‌కతాలో ఉదయం 10:10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించింది. బెంగాల్‌లోని కూచ్‌బెహార్, దక్షిణ్, ఉత్తర దినాజ్‌పూర్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. గువాహటి, అగర్తల, షిల్లాంట్ వంటి నగరాల్లోనూ భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



