Saturday, May 17, 2025
Homeరాష్ట్రీయంనేడు హైదరాబాద్‌లో తిరంగా యాత్ర

నేడు హైదరాబాద్‌లో తిరంగా యాత్ర

- Advertisement -

– ట్యాంక్‌బండ్‌పై ప్రారంభం
– రాజకీయాలకతీతంగా ప్రముఖులను ఆహ్వానించాం : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సైన్యం పోరాట పటిమను, ఆపరేషన్‌ సిందూర్‌ విజయాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద తిరంగా యాత్రను ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తిరంగా యాత్రకు రాజకీయాలకు అతీతంగా అనేక ప్రముఖులను ఆహ్వానించామని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ యాత్రలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో రక్షణరంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. పదేండ్లలో ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన చర్యలు స్పష్టంగా ప్రపంచంముందు కనిపిస్తున్నాయన్నారు. గతంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్ల కోసం ఎదురైన ఇబ్బందుల నుంచి బయటపడి, భారత సైన్యానికి రఫెల్‌ ఫైటర్‌ జెట్లు, బ్రహ్మౌస్‌ క్షిపణులు సమకూర్చారని చెప్పారు. రఫెల్‌ ఎయిర్‌ ఫైటర్‌, ఎస్‌-400 మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ కొనుగోలు సమయంలో కొందరు ఆరోపణలు చేశారనీ, ఇప్పుడు వాటి ప్రాధాన్యత, ఫలితాలను ప్రపంచం చూసిందని అన్నారు. భారత సైన్యానికి కావాల్సిన ఆయుధాలు, ఇతర మౌలిక సదుపాయాల దాదాపు 35 శాతం స్థాయిలో స్థానికంగానే తయారవుతున్నాయనీ, ప్రయివేటు సెక్టార్‌లో భాగస్వామ్యం కూడా పెరిగిందని చెప్పారు. మన దేశ రక్షణ రంగ పరిశోధనలకు కావాల్సిన వసతుల కల్పన జరుగుతున్నదన్నారు. మన సైన్యం కేవలం 23 నిమిషాల్లో ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను, ఐఎస్‌ఐ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిందని కొనియాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత సైన్యం తమ బాధ్యతలను, లక్ష్యాలను విజయవంతంగా పూర్తిచేసిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -