నవతెలంగాణ-హైదరాబాద్: యూనివర్సిటీకి చెందిన మైనారిటీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదంటూ అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (NCMEI) షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఢిల్లీ పేలుళ్ల కేసుతో సంబంధాల దృష్ట్యా అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాను ఎందుకు ఉపసంహరించుకోకూడదో తెలియజేయాలంటూ జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (NCMEI) షోకాజ్ నోటీసు జారీ చేసిందని వర్గాలు తెలిపాయి.
శుక్రవారం నోటీసు జారీ చేయగా.. డిసెంబర్ 4న ఈ విషయంపై విచారణ జరుగుతుందని నోటీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. నివేదికను సమర్పించాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌తో పాటు హర్యానాలోని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసు జారీ చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
తాజాగా దర్యాప్తులో మరొక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీలో చదివిన పూర్వ విద్యార్థికి కూడా టెర్రర్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్నట్లుగా తేలింది. వాస్తవంగా డాక్టర్ ఉమర్ కంటే మాజీ విద్యార్థితోనే ఉగ్ర సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ పూర్వ విద్యార్థి ఇండియన్ ముజాహిదీన్ కీలక సభ్యుల్లో ఒకడైన మీర్జా షాదాబ్ బేగ్ తెలుస్తోంది. 2007లో ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఒక సంవత్సరం తర్వాత 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్లలో పాల్గొన్నట్లు తేలింది.



