నవతెలంగాణ హైదరాబాద్: పాకిస్థాన్‌లో దుండగులు రెచ్చిపోయారు. పెషావర్‌లోని పాక్ పారామిలిటరీ ప్రధాన కార్యాలయంపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు కమాండోలు మరణించగా.. పలువురు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున పెషావర్‌లోని ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
ఆ కార్యాలయాన్ని ముట్టడించిన ముష్కరులు వరుస దాడులు చేశారు. దీంతో అప్రమత్తమైన పారామిలిటరీ సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు కమాండోలు మరణించారు. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రధాన కార్యాలయంలోపల కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో భద్రతా బలగాలు, స్క్వాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టాయి.



